చంద్రబాబుకి నంద్యాల టెన్షణ్‌: నిజమెంత.!

మామూలుగా అయితే నంద్యాల ఉప ఎన్నికలో అధికార తెలుగుదేశం పార్టీకే 'ఎడ్జ్‌' వుండాలి. అయితే, భయపెట్టో బ్రతిమాలో ప్రలోభపెట్టో.. 21 మంది ఎమ్మెల్యేలను 'లాగేసిన' టీడీపీ, ప్రత్యక్ష ఎన్నికల్ని ఎదుర్కోవడానికి మాత్రం కొంత తటపటాయిస్తోంది. తప్పదు మరి, ప్రజాక్షేత్రంలో బలం లేదని తెలిసినప్పుడు ఆ మాత్రం 'తటపటాయింపు' తప్పదు. కానీ, నంద్యాల ఉప ఎన్నిక ప్రత్యేక పరిస్థితుల్లో తలెత్తింది. ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చనిపోయి వుండకపోతే, నంద్యాల నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చేదే కాదు.! 

నిజానికి నంద్యాల నియోజకవర్గాన్ని 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. దురదృష్టవశాత్తూ ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపుకు పాల్పడటంతో, ఆ స్థానాన్ని వైఎస్సార్సీపీ కోల్పోయినట్లయ్యింది. అయితే, ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినా, అసెంబ్లీ రికార్డుల్లో ఇంకా ఆయా నియోజకవర్గాలు వైఎస్సార్సీపీ పేరుతోనే వుండడం గమనార్హం. నైతికత, అనైతికత అన్నదానికి సమాధానం ఆ రికార్డుల్లోనే దొరుకుతుంది. 

ఇక, ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నిక 'పోరు' విషయానికొస్తే, అధికార పార్టీలో ఆందోళన స్పష్టంగా కన్పిస్తోంది. ప్రతిపక్షంపై దాడుల వ్యవహారం అధికార పార్టీ ఆందోళనని చెప్పకనే చెబుతోంది. చివరిదాకా, నంద్యాల ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి నామినేషన్‌ని అడ్డుకోవడానికి అధికార తెలుగుదేశం పార్టీ విశ్వ ప్రయత్నాలు చేసి అభాసుపాలయ్యిందన్నది నిర్వివాదాంశం. 

ఇంకోపక్క, ఏం చేసినా అధికార పార్టీకి నంద్యాల ఉప ఎన్నికలో ఝలక్‌ తప్పకపోవచ్చని చూచాయిగా, టీడీపీ అధికార మీడియానే సన్నాయి నొక్కులు నొక్కుతుండడం గమనార్హం. 'నంద్యాల టౌన్‌లో కొంచెం బెటర్‌, ఇంకో చోట ఫర్వాలేదు. ఫలానా చోట పార్టీ పరిస్థితి దారుణం. ఫర్టిక్యులర్‌గా ఫలానా ప్రాంతంలో ప్రతిపక్షానికి మంచి మెజార్టీ వుంది.. అయినాసరే, అధికార పార్టీ విజయానికి ఢోకా వుండకపోవచ్చు..' అంటూ అధికార పార్టీకి వత్తాసు పలికే మీడియాలోనే కథనాలు పుట్టుకొస్తుండడం గమనార్హం. 

అన్నిటికీ మించి, అధికార పార్టీలో 'కలిసికట్టుగా పనిచేయడం' అన్న మాటకి అర్థమే లేకుండా పోయింది. ఎవరి దారి వారిదే. రాజకీయంగా మంత్రి అఖిల ప్రియ ఇంకా ఓనమాలు నేర్చుకునే స్థితిలో వుండడమే దీనికి కారణం. ఎవర్నీ ఆమె కలుపుకుపోవడంతో ఈ దుస్థితి దాపురించింది. ఆటోమేటిక్‌గా అఖిలప్రియ అనుభవరాహిత్యం అధికార పార్టీకి శాపంగానూ, ప్రతిపక్షానికి లాభంగానూ మారిపోతుంది. 

ఇదిలా వుంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నంద్యాల ఉప ఎన్నికపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 'కలిసికట్టుగా పనిచేయండి..' అంటూ నెత్తీనోరూ బాదుకుంటున్నా కర్నూలు జిల్లాలో నేతలది 'తలోదారి' మాత్రమే. మొత్తంగా చూస్తే, ప్రజల సంగతి తర్వాత.. సాక్షాత్తూ మంత్రిగారు, మిగతా నేతల్ని మెప్పించలేకపోతున్నారు.. వెరసి, చంద్రబాబు మాటకి సైతం విలువ లేని పరిస్థితి. ఇది చాలదా, నంద్యాల ఉప ఎన్నిక చంద్రబాబుకి గుదిబండగా మారిందని చెప్పడానికి.!

Show comments