వన్‌ అండ్‌ ఓన్లీ కంగనా రనౌత్‌

'ఏక్‌ నిరంజన్‌' బ్యూటీ కంగనా రనౌత్‌, ఈ మధ్య ఎక్కువగా వివాదాస్పద వ్యాఖ్యలతోనే వార్తల్లోకెక్కుతోంది. ఆమె ఏం మాట్లాడినా అది సంచలనమే అవుతోంది. 'నేను మామూలుగానే మాట్లాడుతున్నా.. నా మాటల్లో వివాదాల్ని వెతుకుతున్నారు.. వాటితో నన్ను వివాదాల్లోకి లాగుతున్నారు..' అంటూ కంగనా తనదైన స్టయిల్లో ఈ వ్యవహారంపై స్పందిస్తోందనుకోండి.. అది వేరే విషయం. 

'నాలోని లోపాల్ని ఎవరైనా ఎత్తి చూపితే నేనూరుకోను.. నేనేం చెయ్యాలో నాకు తెలుసు.. ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలని ఎవరూ నాకు చెప్పక్కర్లేదు.. నాకు నేనే చెప్పుకోగలను.. నన్ను నేను ఎంకరేజ్‌ చేసుకోగలను.. మోటివేట్ చేసుకోగలను.. ఒక్కమాటలో చెప్పాలంటే నాకు నేనే అన్నీ..' అంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో కంగనా రనౌత్‌ చేసిన వ్యాఖ్యలు కాస్త వెరైటీగా వున్నాయి కదా. 

సినిమా హిట్టయినా, ఫ్లాపయినా కంగనా రనౌత్‌ ఒకేలా వుంటుందట. కథ ఓకే చేసేటప్పుడే, అందులోని పాత్ర గురించి ఆలోచిస్తాననీ, ఒక్కసారి కమిట్‌ అయ్యాక దాని గురించి మళ్ళీ ఆలోచించడం జరగదనీ, సినిమా హిట్టయితే ఉప్పొంగిపోవడం, ఫ్లాపయితే బాధపడటం అనేవి తన విషయంలో జరగనే జరగవని తేల్చి చెప్పింది కంగనా రనౌత్‌. 'ఎవరన్నా నన్ను విమర్శిస్తే ఊరుకోలేను.. నా మీద కామెంట్లు వేస్తే వెంటనే కోపమొచ్చేస్తుంది.. కౌంటర్ ఇచ్చాకనే హ్యాపీగా వుంటుంది..' అంటోన్న కంగనా, తనలాంటివారు చాలా అరుదుగా వుంటారనీ, తానెప్పుడూ 'వన్‌ అండ్‌ ఓన్లీ..' అనుకుంటానని చెప్పుకొచ్చింది.

అవార్డుల గురించి కంగనా ఎక్కువగా ఆలోచించదట. అవార్డులు తీసుకునేటప్పుడు ఎగ్జయిటింగ్ అనేది తనలో వుండదనీ, తన ప్రతిభకు తగిన గుర్తింపు అని మాత్రమే అనుకుని, లైట్ తీసుకుంటానంటోన్న కంగన, నిజంగానే ’వన్ అండ్ ఓన్లీ‘ అనుకోవాలేమో.

Show comments