సాధారణంగా పిండికొద్దీ రొట్టే అన్నట్లు వుంటుంది సినిమా పబ్లిసిటీ. హీనంలో హీనం పాతికలక్షల నుంచి అయిదారు కోట్ల వరకు. మరి పలు భాషల్లో, విదేశాల్లో భారీగా విడుదలవుతున్న బాహుబలికి ఎంత వుండాలి ఖర్చు. కనీసం పాతికకోట్లు? కానీ నిజానికి బాహుబలి పబ్లిసిటీ ఖర్చు దాదాపు జీరోనే. అదే రాజమౌళి అండ్ శోభు యార్లగడ్డ చాకచక్యం. బాహుబలిపై జనాల్లో వున్న ఆసక్తి మీడియా బలహీనత అనుకోవాలి. దాంతో వాళ్లు కోరి కోరి, కొసరి కొసరి బాహుబలి వార్తలు అందిస్తున్నారు. దాంతో ఖర్చే లేదు. పైగా బాహుబలి వన్‌కు వచ్చిన క్రేజ్‌తో బాహుబలి-2కు మీడియా పార్టనర్‌లుగా చాలా మంది చేరారు.
నెస్లే కంపెనీ తన మంచ్ చాక్‌లెట్‌ను బాహుబలి-2 ప్రచారానికి జోడించింది. ఇందుకుగాను, ఆ కంపెనీ బాహుబలి టీమ్‌తో కుదుర్చుకున్న ఒప్పందం విలువ 7కోట్లు. ఇందులో 90శాతం వరకు టీవీ ప్రకటనల కోసం ఖర్చు చేస్తుంది ఆ కంపెనీ. అంటే ఇటు బాహుబలి-2 ప్రకటనలు, నెస్లే ప్రకటనలు కలిపి వస్తాయన్నమాట. ఓ పదిశాతం మాత్రం బాహుబలి నిర్మాతలకు నగదుగా లభిస్తుంది. అలాగే బ్రిటానియా కంపెనీ కుదుర్చుకున్న ఒప్పందం విలువ నాలుగుకోట్లు. ఇలాంటి కంపెనీలు ఇంకా చాలానే వున్నాయి. మీడియా సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు కలిసి, బాహుబలితో కుదుర్చుకున్న ఒప్పందాల విలువ యాభైకోట్లు అని అంచనా. దీనివల్ల అయిదుకోట్ల వరకు నగదుగా నిర్మాతలకు లభించి వుంటుందని అంచనా. మిగిలిన 45కోట్లు ప్రచారానికి వాడతారు. అంటే ఇటు పబ్లిసిటీ ఫ్రీ. అటు అదనపు ఆదాయం.