క్రమశిక్షణ రాహిత్యం ఎవరిది!

తన జీవితంలోనే అత్యుత్తమైన కేబినెట్‌ ఇది  అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినట్లు టీడీపీ అనుకూల మీడియాలలో ఒక కథనం వచ్చింది. ఆయన నిజంగానే ఆ మాట అని ఉంటే అది ఆశ్చర్యంగానే కనిపించినా, ఆయన సహజ శైలికి దగ్గరగానే మాట్లాడారని అర్దం చేసుకోవచ్చు. ఏ నిర్ణయం అయినా దానిని సమర్దించుకోవడానికి పార్టీలో వస్తున్న విమర్శలను ఎదుర్కోవడానికి అనకు అండగా ఉండే మీడియాను అడ్డం పెట్టుకుని ఇలాంటి వాదనలు లీక్‌ చేస్తుంటారు. అంతేకాదు.. బొండా ఉమామహేశ్వరరావు వంటివారు తమకు మంత్రిపదవి ఎందుకు ఇవ్వలేదని అడిగితే మొదటిసారి ఎన్నికైన వారు ఇలా అడగడం భావ్యమేనా అని అన్నారని కూడా అదే మీడియాలో లీక్‌ వచ్చింది. పార్టీ ప్రయోజనాల కోసమే తాను ఈ నిర్ణయాలు తీసుకున్నానని, క్రమశిక్షణ విషయంలో తాను గట్టిగా ఉంటానని తనను విమర్శిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలను ఆయన హెచ్చరించారు. ఇక్కడ అనేక విషయాలు విశ్లేషించుకోవాలి. 

కేబినెట్‌లో ఆశించినవారందరికి పదవులు ఇవ్వలేం అది వాస్తవమే. కాని నాలుగు ముఖ్యమైన సామాజికవర్గాలు ముస్లింలు, గిరిజనులు, క్షత్రియ, బ్రాహ్మణ వర్గాలకు ప్రాతినిథ్యం కేబినెట్‌ అత్యుత్తమం ఎలా అవుతుందన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఈ కేబినెట్‌ సామాజిక సమతుల్యత కోల్పోయిందన్న విమర్శ కూడా దీనివల్లే వచ్చింది. తన కుమారుడు లోకేష్‌ను వారసుడిగా తీర్చిదిద్దడం కోసం చేసిన ఈ విస్తరణ చేశానని ఆయన నిజాయితీగా చెప్పి ఉంటే దానిని ఎవరూ తప్పుపట్టరు. చంద్రబాబులో ఇదే లోపించింది. దాంతో ఆయన అన్నీ అబద్దాలు చెబుతారు అని ప్రజలు అనుకునే పరిస్థితిని ఆయనే సృష్టించుకున్నారు. మొదటిసారి ఎమ్మేల్యే అయితే ఎవరికి పదవి ఇవ్వరా అంటే అదేమీ కాదు. 

లోకేష్‌ ఎమ్మెల్యేల కోటా నుంచి ఎలాంటి శ్రమ లేకుండా ఎమ్మెల్సీ అయి ప్రమాణం చేసిన నాలుగోరోజే మంత్రి అయిపోయారే. అలాగే ప్రస్తుతం కేబినెట్‌లో ఉన్న కొల్లు రవీంద్ర, జవహర్‌, అఖిలప్రియ, వంటివారు మొదటిసారి ఎన్నికైనవారే కదా! ఆ మాటకు వస్తే చంద్రబాబు నాయుడు కూడా 1978లో తొలిసారి ఎన్నికైన తర్వాత కాంగ్రెస్‌లో గ్రూప్‌ కట్టి, పైరవీ చేసుకుని మంత్రి అయ్యారన్న విషయం ఆయన మర్చిపోయి ఉండవచ్చు. తొలుత లోకేష్‌ను రాజ్యసభ సభ్యుడిని చేయాలని అనుకున్నారట. కాని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సలహా మేరకు ఆయనను ఎమ్మెల్సీగా చేసి మంత్రిగా తీసుకున్నారట. కేంద్రంలోకి లోకేష్‌ నేరుగా వెళితే ఎక్ప్‌ పోజ్‌ అయి దెబ్బతినే ప్రమాదం ఉంటుందని, రాష్ట్రంలో అయితే లోకేష్‌ ఏవైనా తప్పులు చేసినా చంద్రబాబుకు కవర్‌ చేసే అవకాశం ఉంటుందని కేసీఆర్‌ సలహా ఇచ్చారని టీఆర్‌ఎస్‌ నేత ఒకరు అన్నారు.

 ఆ విషయం ఎలా ఉన్నా ఫార్టీ ఫిరాయింపుదారులకు మంత్రిపదవులు ఇవ్వడం క్రమశిక్షణ రాహిత్యం  అవుతుందా? ఇదేమి పద్దతి, ఇది ఏమి ప్రభుత్వం అని ప్రశ్నించిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటివారిది క్రమశిక్షణా రాహిత్యం అవుతుందా? పార్టీ ప్రయోజనాలకోసమే తాను ఇలా ఫిరాయింపుదారులకు మంత్రిపదవులు ఇచ్చానని చంద్రబాబు చెప్పడం కూడా ఆసక్తికరమైన అంశమే. ఇక్కడ ఆయన ఒక నిజాన్ని ఒప్పుకుంటున్నారనుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఏపీలో బాగా బలహీనంగా ఉందని, దానిని పటిష్టం చేసుకోవడానికి ఇలాంటి అనైతిక పద్ధతులకు తాను దిగాల్సిందనని, సిద్దాంతాలు, విలువలతో చేసే ఈ ప్రకియకు తెలుగుదేశం క్యాడర్‌ కూడా తలూపాల్సిందేనని చంద్రబాబు చెబుతున్నారన్న అర్ధం వస్తుంది. 

ఒకప్పుడు ఎన్‌టీఆర్‌ ఇలా ఎవరైనా పార్టీ మారాలని అనుకుంటే రాజీనామా చేయించేవారు కదా అని ఎవరైనా అడిగితే అది క్రమశిక్షణా రాహిత్యం, ఎన్‌టీఆర్‌ తెలివి తక్కువతనం అనుకోవచ్చు. ఏది ఏమైనా చంద్రబాబు రాజకీయాలలో సఫలం కావడానికి ఏమైనా చేయడానికి సిద్దపడతారని మళ్లీ, మళ్లీ రుజువు చేస్తున్నారు. అది ఆయనకు హక్కుగా ఉంది. అదే ఆయన విజయరహస్యంగా ఉంది. ఈ క్రమంలో ఓడిపోతుందన్నది విలువలు, నైతికత కోరుకునే ప్రజలే! ఆ పరిస్థితికి ప్రజలు కూడా భాద్యులే కదా!

కొమ్మినేని శ్రీనివాసరావు

Show comments