తమిళనాట ఇంకా విడుదలకాని బాహుబలి-2

ప్రపంచమంతా బాహుబలి-2 మేనియాలో మునిగి తేలుతోంది. ఇప్పటికే సినిమా టాక్ బయటకు వచ్చేసింది. కానీ తమిళనాడులో మాత్రం బాహుబలి - ది కంక్లూజన్ సినిమా ఇంకా విడుదల కాలేదు. నిన్న రాత్రి పడాల్సిన ప్రీమియర్ తో పాటు ఈరోజు మార్నింగ్ షోలు కూడా రద్దయ్యాయి.

తమిళనాట సినిమాను పంపిణీ చేస్తున్న కె-ప్రొడక్షన్స్ సంస్థకు, బాహుబలి నిర్మాతలకు మధ్య ఆర్థిక లావాదేవీలు ఇంకా ఓ కొలిక్కి రాకపోవడంతో బాహుబలి-2 సినిమా విడుదల నిలిచిపోయింది. ప్రస్తుతం ఈ సమస్యను పరిష్కరించడం పైనే బాహుబలి నిర్మాతలు ఫుల్ ఫోకస్ పెట్టారు. కనీసం మ్యాట్నీ ఆట నుంచైనా బాహుబలి-2ను తమిళనాట విడుదల చేయడానికి ప్రొడ్యూసర్లు ప్రయత్నిస్తున్నారు.

బాహుబలి-2 విడుదలకు ముందు వరకు కర్ణాటకతో సమస్య వచ్చింది. ఇప్పుడు విడుదల తర్వాత తమిళనాడులో సమస్య తలెత్తింది. సత్యరాజ్ భేషరతుగా క్షమాపణలు చెప్పడంతో కన్నడంలో బాహుబలి-2 విడుదల సాఫీగా జరిగిపోయింది. కానీ ఫైనాన్షియల్ మేటర్స్ కారణంగా తమిళనాట ఈ సినిమా ఇంకా థియేటర్లలోకి రాలేదు.

Show comments