''పదవులు రాలేదు.. అలాగని పార్టీని కాదనుకోగలమా.? ఏమో, అధినేతకు కోపమొస్తే ఏమైనా జరగొచ్చు. అసంతృప్తిని వెల్లగక్కాం.. ఆగ్రహం వ్యక్తం చేశాం.. చివరికి కంటతడి కూడా పెట్టాం. ఇంతకు మించి ఇంకేం చేయగలం.? ఇంకేం చేస్తాం, సర్దుకుపోతాం..''
- ఇదీ మంత్రి పదవులపై ఆశలు పెట్టుకుని, ఆశలు అడియాశలు కావడంతో ఉస్సూరుమంటున్న కొందరు తెలుగు తమ్ముళ్ళ తీరు. మరికొందరు మాత్రం జరిగిన అవమానాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీకి గుడ్ బై చెప్పడానికీ వెనుకంజ వేయడంలేదు. అందుకే, బెదిరింపులూ తీవ్రతరమయ్యాయి చంద్రబాబు నుంచి.
ఒకరొకరుగా అసంతృప్త నేతలు దార్లోకొస్తుండడంతో, అధినేత చంద్రబాబుకి పెద్ద టెన్షన్ ప్రస్తుతానికైతే తప్పినట్లేనని టీడీపీ నేతలు పైకి చెబుతున్నా, తెరవెనుక పరిస్థితులు అంత సానుకూలంగా లేవన్నది నిర్వివాదాంశం. తనయుడికి మంత్రి పదవి ఇచ్చుకున్న చంద్రబాబు, సీనియర్లను పక్కన పెట్టేసిన వైనం పార్టీలో ప్రతి ఒక్కర్నీ విస్మయానికి గురిచేస్తోంది. కానీ, పార్టీ ముఖ్య నేతలతోనే, 'లోకేష్ మంత్రి అవ్వాల్సిందే..' అని ముందే అన్పించేయడం ద్వారా, అందరి గొంతూ నొక్కేయడం చంద్రబాబుకి తేలికయ్యింది.
చంద్రబాబు సంగతి అలా వుంచితే, మంత్రి పదవి విషయమై తమకు చినబాబు నుంచీ హామీ దక్కిందనీ, పెదబాబు - చినబాబు.. ఇలా ఇద్దరూ తమను నట్టేట్లో ముంచేస్తారనుకోలేదని సన్నిహితుల వద్ద వాపోతున్నారు కొందరు తెలుగు తమ్ముళ్ళు. పదవుల సంఖ్య తక్కువ, ఆశావహుల సంఖ్య ఎక్కువ కాబట్టి, అందర్నీ 'అకామడేట్' చేయలేమని చంద్రబాబు చెప్పుకోవచ్చుగాక. కానీ, పార్టీ ఫిరాయించిన వారిలో ఒకరిద్దరికి పదవులు ఇచ్చి, మిగతావాటిల్లో తమకు అవకాశమిచ్చి వుండాల్సిందన్నది సీనియర్ల మాట.
'జరిగిందేదో జరిగిపోయింది.. ఇకపై పార్టీ కోసం పనిచేయండి.. పదవులు ముందు ముందు వస్తాయి..' అంటూ ఓ పక్క బుజ్జగిస్తూనే, 'పార్టీ నుంచి బయటకు వెళ్ళారో ఖబడ్దార్..' అంటూ హెచ్చరికలూ ఇంకోపక్క జారీ చేస్తున్న చంద్రబాబు, ఎలాగైతేనేం అందర్నీ తనదారికి తెచ్చుకుంటుండడం గమనార్హం. 'ఎన్నికలకు ఇంకా రెండేళ్ళు మాత్రమే వుంది.. ఈలోగా ఈ దారుణం జరిగిపోయింది..' అంటూ టీడీపీ ఎమ్మెల్యే శివాజీ నిన్న కన్నీరుమున్నీరవడం పార్టీ పరిస్థితిని చెప్పకనే చెబుతోంది.
ఇదిలా వుంటే, పార్టీ ఫిరాయించినవారికి మంత్రి పదవులు ఇవ్వడం ద్వారా, మరోమారు పార్టీ ఫిరాయింపులకు చంద్రబాబు మార్గం సుగమం చేసినట్లయ్యింది. ఈ నెలలో కనీసం ఇద్దరు ఎమ్మెల్యేలను వైఎస్సార్సీపీ నుంచి లాగెయ్యాలనే తాజా వ్యూహాన్ని ఆయన సిద్ధం చేశారట. ఆ వ్యూహం వర్కవుట్ అయితే, పార్టీలో అసంతృప్తి తగ్గడంతోపాటుగా, ప్రభుత్వ వ్యతిరేకత ఏమీ లేదన్న సంకేతాలు పంపాలన్నది చంద్రబాబు ఆలోచన. చూద్దాం.. ఏం జరుగుతుందో.!