ఖద్దరు దొంగల్ని కాపాడుతున్నదెవరు.?

ఎమ్మెల్యేకి ఫలానా పర్సంటేజ్‌.. ఎంపీకి ఫలానా వాటా.. మంత్రిగారికి కొంత తాయిలం.. వార్డ్‌ మెంబర్‌ దగ్గర్నుంచి, కేంద్ర మంత్రిదాకా.. ఆ మాటకొస్తే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కూడా అవినీతికి అతీతం కాదు. దేశ చరిత్రలో ఎందరో రాజకీయ ప్రముఖులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. జైళ్ళకు వెళ్ళి వచ్చారు, నీతిమంతులుగా రాజకీయాలు చేస్తూనే వున్నారు. అసలు, దేశంలో రాజకీయ రంగంలో పేరుకుపోయినంత అవినీతి ఇంకెక్కడా వుండదు. అసలంటూ అవినీతికి మూలమే రాజకీయం. 

ఇది వాస్తవం. కానీ, గడచిన నలభై మూడు రోజుల్లో ఎక్కడా ఏ రాజకీయ నాయకుడిపైనా ఐటీ దాడులు జరగలేదు. టీటీడీ బోర్డ్‌ సభ్యుడిపైన ఐటీ దాడి జరిగింది. తమిళనాడు చీఫ్‌ సెక్రెటరీపై ఐటీ దాడి నేడు సంచలనం సృష్టించింది. దేశవ్యాప్తంగా పెద్ద పాత నోట్ల రద్దు తర్వాత ఐటీ దాడులు అక్కడక్కడా కొనసాగుతూనే వున్నాయి. కానీ, రాజకీయ నాయకులెక్కడ.? అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌ అయిన రాజకీయ నాయకులు, హ్యాపీగా మీడియా ముందుకొచ్చి పెద్ద పాత నోట్ల రద్దుకు అనుకూలంగానో, వ్యతిరేకంగానో ఎందుకు హ్యాపీగా స్టేట్‌మెంట్లు ఇవ్వగలుగుతున్నారు.! 

125 కోట్ల మంది భారతీయుల్ని వేధిస్తున్న ప్రశ్న ఇది. ఓ రాష్ట్ర చీఫ్‌ సెక్రెటరీ కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారంటే, ఆ రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు, మంత్రులు ఏ స్థాయిలో అవినీతికి పాల్పడి వుండాలి.? దేశంలో తమిళనాడు రాష్ట్రమొక్కటేనా.? అవినీతి అక్కడే వుందా.? ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత నరేంద్రమోడీ ప్రభుత్వమ్మీదనే వుంది. ఢిల్లీలో అధికార పార్టీకి చెందిన నేతలపై సీబీఐని ప్రయోగించడం.. పశ్చిమబెంగాల్‌లోనూ ఇవే తరహా 'చిలిపి పనులు' చోటు చేసుకోవడం.. తమిళనాడులో ఇప్పుడిలా 'తమ గొప్పతనాన్ని చాటుకోవడం'.. ఇవన్నీ చూస్తోంటే, మోడీ సర్కార్‌పై కాస్తో కాస్తో కూస్తో వున్న నమ్మకం పూర్తిగా అటకెక్కుతోంది. 

ఢిల్లీ కాదు, పశ్చిమబెంగాల్‌ కాదు, తమిళనాడు కాదు.. మొత్తంగా దేశమంతా ఐటీ దాడులు జరగాలి.. ముందుగా రాజకీయ ప్రముఖుల మీదనే దాడులు జరగాలి. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడాల్లేకుండా ఐటీ దాడులు జరగాలి. అవసరమైతే సీబీఐ, ఇంకా అవసరమైతే ఈడీ.. ఇవన్నీ రంగంలోకి దిగాలి. భవిష్యత్తులో అవన్నీ జరుగుతాయ్‌.. అంటూ బీజేపీ సన్నాయి నొక్కులు నొక్కుతోందిగానీ, అది నిజంగానే జరుగుతుందా.? ఛాన్సే లేదు.. ఎందుకంటే నరేంద్రమోడీ కూడా రాజకీయ నాయకుడే కదా.!

Show comments