శశి తమిళనాడు సీఎం పీఠంపైకి? పన్నీరు ఢిల్లీకి..!

‘తమిళనాడు సీఎం ఢిల్లీ పర్యటన..’ చాలా సంవత్సరాల తర్వాత ఈ మాట వినిపిస్తోంది. జయలలిత ముఖ్యమంత్రిగా ఉండిన గత ఐదారేళ్లలో ఇలాంటి మాట వినిపించేది కాదు. జయ ఢిల్లీకి వెళ్లడం కాదు.. ఢిల్లీనే జయ దగ్గరకు వచ్చేది. చక్రం తిప్పుతాం.. అని చెప్పుకునే సీఎంలు గత రెండేళ్లలో ఢిల్లీ పర్యటనల సంఖ్య విషయంలో సెంచరీలు కొట్టేస్తూ మోడీకి పాద సేవలు చేస్తూ ఉన్నా, జయ మాత్రం చెన్నై దాటలేదు. కేంద్రమంత్రులు ఆమె దర్శనం కోసం, ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి చెన్నై వెళ్లే వారు.

ఆ సంగతలా ఉంటే.. ఉన్నఫలంగా ఢిల్లీ పర్యటన పెట్టుకున్నాడు పన్నీరు సెల్వం. ఇటీవల తుపాను మిగిల్చిన నష్టం గురించి నివేదిక ఇచ్చి.. సాయం అడగడానికి పన్నీరు ఢిల్లీకి వెళ్తున్నాడని అంటున్నారు కానీ, ఇదే సమయంలో తమిళనాడు రాజకీయ పరిణామాలు పన్నీరు ఢిల్లీ పర్యటన గురించి పలు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.

శశికళ ను అన్నాడీఎంకే అధినేత్రిగా చేయడానికి ఇప్పటికే పార్టీలోని సర్వసభ్యులంతా సమ్మతించగా, ఇప్పుడు ఆమెను ముఖ్యమంత్రిగా చేయాలనే డిమాండ్ కూడా మొదలైంది. పన్నీరును దించేసి, శశిని ముఖ్యమంత్రిగా చేయాలని అన్నాడీఎంకే నుంచే డిమాండ్ వినిపిస్తోంది!

మరి పార్టీ అధినాయకత్వ స్థానంలో శశి, ముఖ్యమంత్రిగా పన్నీరు.. సర్దుకుంటారనుకుంటే, ఇప్పుడు శశి దూకుడు చూసి పన్నీరు అండ్ కో విస్మయానికి గురి అవుతోంది. Readmore!

ఇలాంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి హోదాలో ఆయన  ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది! శశిని ముఖ్యమంత్రిగా చేయాలని అన్నాడీఎంకేలోని కొంతమంది వాదిస్తున్న నేపథ్యంలో.. తన పదవిని కాపాడుకోవడానికి కేంద్రాన్ని ప్రసన్నం చేసుకునే యత్నాలను పన్నీరు చేస్తున్నాడని విశ్లేషకులు అంటున్నారు.

ముందుగా మోడీని శరణుజొచ్చితే.. తన పదవి భద్రంగా ఉంటుందని పన్నీరు భావిస్తున్నాడనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు పన్నీరును రక్షించగలిగింది మోడీ మాత్రమే కావొచ్చు! జయ చనిపోయినప్పుడు అయితే.. పన్నీరు, శశిలు పోటీలు పడి మోడీ దగ్గర విలపించారు. ఆయన ఇద్దరినీ ఓదార్చాడు. ఇప్పుడు ముందుగా పన్నీరు ఢిల్లీ వెళ్తున్నాడు. మరి శశి ఇప్పుడు ఎలాంటి అస్త్రాన్ని సంధిస్తుందో!

Show comments

Related Stories :