శశికళది దురాశ? పన్నీరు సెల్వంను దించేయాలని చూస్తున్న వారు తొందరపడుతున్నారా? వీళ్లంతా ఇలా గేమ్స్ ఆడుతూ ఉంటే పన్నీరు సెల్వం చూస్తూ ఊరుకుంటాడా? సీఎం పదవికి రాజీనామా చేసి వెళ్లిపోతాడా? ఎంత జయలలితకు డమ్మీగా వ్యవహరించిన వ్యక్తి అయితే మాత్రం.. శశికళకు కూడా డమ్మీగానే మిగిలిపోతాడా? ఇప్పటికే ఒకసారి ఢిల్లీ వరకూ వెళ్లొచ్చిన పన్నీరు.. మోడీకి సాష్టాంగ పడే ఉంటాడు! కాబట్టి.. అంత తేలికగా పదవిని వదులుకుంటాడని అనుకోవడానికి లేదు.
అయితే.. పార్టీలోని మెజారిటీ మంత్రులు, సీనియర్లు శశి.. శశి.. అంటూ బహిరంగంగానే అనేస్తున్నారు కాబట్టి, పన్నీరు దిగిపోక తప్పేలా లేదు! మోడీ చక్రం అడ్డేసి.. శశికళ అండ్ కో ని కంట్రోల్ చేస్తే తప్ప, పన్నీరుకు పదవి నిలబడటం కష్టం.
ఈ పొలిటికల్ గేమ్ లో అన్నాడీఎంకే కథ ఇది. మరోవైపు డీఎంకే ఉండనే ఉంది. ముందులాగా కాదు, మొన్నటి టర్మ్ లో 90 సీట్ల వరకూ సాధించుకుని.. బలమైన ప్రతిపక్ష నేతగా నిలిచింది డీఎంకే. జయ ఆసుపత్రిలో ఉన్నప్పుడే.. కొంతమంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు డీఎంకే నేత స్టాలిన్ కు టచ్ లోకి వచ్చారనే ప్రచారం జరిగింది. మరి అలాంటిది ఇప్పుడు.. అన్నాడీఎంకే పరిస్థితిని ఆసరాగా చేసుకుని డీఎంకే రాజకీయ గందరగోళాన్ని సృష్టించే అవకాశాలు లేకపోలేదు.
ఇప్పటికే పన్నీరు సెల్వం బలనిరూపణ చేసుకోవాలని డీఎంకే డిమాండ్ చేసింది. చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు శశికళ సీఎంగా ఉండాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ పరిణామాల మధ్య పన్నీరు బలం నిరూపించుకోవాలని డీఎంకే కోరుతోంది. ఒకవేళ పన్నీరు గనుక సీఎం పదవిని దిగడానికి ఇష్టపడకపోతే మాత్రం.. అన్నాడీఎంకేలో రచ్చ రేగుతుంది. అలాంటి సమయంలో స్టాలిన్ కొంతమంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను తన వైపుకు తిప్పుకున్నా.. రాష్ట్రపతి పాలనకో, అటు నుంచి మధ్యంతరానికో బాటలు పడ్డట్టే!
మొన్నటి ఎన్నికల్లోనే జయ పార్టీకి పూర్తి పోటీని ఇచ్చింది డీఎంకే. ప్రస్తుత పరిణామాల మధ్య గనుక ఎన్నికలు జరిగితే.. డీఎంకే కు కాలం కలిసొచ్చినట్టే. వారి విజయం నల్లేరు మీద నడకకాగలదు. ఆ ఎన్నికలు రప్పించడానికి అనుగుణంగానే డీఎంకే వ్యూహాలు సాగవచ్చిక.