బాలయ్య కూతురికి అలా.. రోజాకి ఇలా..

ఎంతైనా బావమరిది బాలయ్య కుమార్తె.. పైగా, తనకు కోడలు కదా.. అందుకే, బ్రహ్మణిని 'ఎంటర్‌ప్రెన్యూర్‌' కేటగిరీలో మహిళా పార్లమెంటేరియన్‌ సదస్సుకి ఆహ్వానించి, బ్రహ్మరథం పట్టేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. చంద్రబాబు కోడలికి టీడీపీ నేతలు వంగి వంగి దండాలు పెట్టినంత పన్జేశారు. ప్రభుత్వాధికారులూ ప్రత్యేక గౌరవమిచ్చారామెకి. కానీ, రోజా అలా కాదు కదా. ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యే.. పైగా అధికార పార్టీకి బద్ధ వ్యతిరేకి.. అందుకే, ఆమెను అరెస్ట్‌ చేసేశారు పోలీసులు. అసలు, మహిళా పార్లమెంటేరియన్‌ సదస్సు చంద్రబాబు వ్యక్తిగత ప్రాపకం కోసం, వ్యక్తిగత ఖర్చుతో జరుగుతన్నదా.? ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఖజానా నుంచి వెచ్చించి నిర్వహించడంతో జరుగుతున్నదా.? 

అత్యంత దారుణమైన విషయమిది. రోజా, గలాటా సృష్టిస్తారనేది ఇంటెలిజెన్స్‌ సమాచారమట. అందుకే ఆమెను అడ్డుకున్నారట. అధికార పార్టీ నేతలు, రోజా అరెస్ట్‌పై చెబుతున్న విషయమిది. పోలీసు ఉన్నతాధికారులూ మీడియా ముందుకొచ్చి రోజా తమ అదుపులో వున్నారనీ, ఆమెను హైద్రాబాద్‌కి తరలిస్తున్నామనీ చెప్పుకొచ్చారు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన ఇది. 

బాలీవుడ్‌ హీరోయిన్‌ మనీషా కొయిరాలా, ఈ వేదికపై మాట్లాడింది. సినీ రంగంలో మహిళల్ని అణగదొక్కుతున్న వైనంపై ఆవేదన వ్యక్తం చేసింది. ఇది నిన్నటి వ్యవహారం. చాలామంది మహిళా ప్రముఖులు, అదే సమయంలో పురుష ప్రముఖులు కూడా మహిళల్ని చిన్నచూపు చూడటంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బహుశా రోజా కూడా, అదే తరహాలోనే మాట్లాడేవారేమో. కాదు, ఇంకొంచెం గట్టిగానే మాట్లాడాలనుకున్నారనే అనుకుందాం. అంతమాత్రాన ఆమెను అడ్డుకోవడం హాస్యాస్పదం. 

ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ వుంటుంది. ఆహ్వానం పంపించి, అవమానించడమంటే, మహిళా పార్లమెంటేరియన్‌ సదస్సుని, అధికారపక్షమే అట్టర్‌ ఫ్లాప్‌ చేసినట్లవుతుంది. ఇప్పుడు జరిగిందదే. విదేశాల నుంచి ఎంతమంది వస్తేనేం.? ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఓ మహిళా ప్రజా ప్రతినిథి.. అందునా, ప్రతిపక్షం వైఎస్సార్సీపీ మహిళా అధ్యక్షురాలు.. హాజరు కాలేని పరిస్థితిని కల్పించారంటే అసలు ఈ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు ఎందుకట.?  Readmore!

కొసమెరుపు: రోజాని అరెస్ట్‌ చేసి హైద్రాబాద్‌కి తరలిస్తున్నారట. ఇంతకన్నా హేయమైన విషయం ఇంకేముంటుంది.? ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అరెస్ట్‌ చేసి, తెలంగాణకి అప్పగించడమట. విన్నారా ఈ విడ్డూరం.?

Show comments