వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను అడ్డగోలుగా తమ పార్టీలో చేర్చేసుకుని బలం పెంచుకోవడానికి అధికార తెలుగుదేశం పార్టీ రకరకాల ప్రలోభాలకు పాల్పడి, నైతిక విలువలను తుంగలో తొక్కేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. వైకాపా గుర్తు మీద గెలిచిన వారితో కనీసం రాజీనామా చేయించి మళ్లీ గెలిపించుకోవాలన్న స్పృహ కూడా లేకుండానే.. తెలుగుదేశం ప్రభుత్వంలో వారిని మంత్రులుగా కూడా తీసుకున్నారు.
ఇలాంటి అనైతిక ఫిరాయింపుల మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు పట్టువదలని పోరాటం సాగిస్తోంది. అటు స్పీకరుకు తరచుగా ఫిర్యాదులు చేయడంతోపాటూ, న్యాయస్థానంలో కూడా కేసు నడుపుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్సీ అయిన శిల్పా చక్రపాణి రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. అయితే జగన్ ఆయన విషయంలోనూ తాను నమ్మిన నైతిక విలువలను పాటించడానికే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
శిల్పా చక్రపాణిని ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయాల్సిందిగా, జగన్ కోరినట్లు సమాచారం. ఫిరాయింపుల గురించి తాము తెలుగుదేశం పార్టీని ఏ రకంగా తప్పుపడుతున్నామో.. అలా ఈ ఒక్క ఎమ్మెల్సీ పదవి గురించి తమను ఎవ్వరూ మాటలు అనే పరిస్థితి రాకూడదని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారట. ఈ మేరకు ఆ పదవికి కూడా రాజీనామా చేసేయాల్సిందిగా.. పార్టీలో చేర్చుకున్న సందర్భంలోనే చక్రపాణి రెడ్డికి సూచించారు. కాకపోతే.. చక్రపాణి ఈ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని వార్తలు వస్తున్నాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు, అధికార తెలుగుదేశంలో చేరిపోయారు. పదవుల దగ్గరినుంచి కాంట్రాక్టు పనుల వరకు వీరికి రకరకాల ప్రలోభాలు చూపించారంటూ ఆరోపణలు వినిపించాయి. అయితే ఏ ఒక్కరు కూడా తమ ఎమ్మెల్యే పదవికి మాత్రం రాజీనామాలు చేయలేదు. తెలంగాణలో తెదేపా నుంచి తెరాసలోకి వెళ్లిన తలసాని శ్రీనివాస యాదవ్ కు మంత్రిపదవి ఇచ్చినందుకే నానా యాగీ చేసిన తెలుగుదేశం, ఏపీలో మాత్రం అదే మాదిరిగా రెచ్చిపోయి, వైకాపా నుంచి వచ్చిన నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టేసింది.
రాజ్యాంగ విరుద్ధంగా, విలువలను మంటగలిపేస్తున్న ఇలాంటి నిర్ణయాలపై వైఎస్సార్ కాంగ్రెస్ తమ పోరాటం సాగిస్తూనే ఉంది. ఇలాంటి సమయంలో.. తెదేపా నుంచి వచ్చిన చక్రపాణి ఎమ్మెల్సీ పదవిలో కొనసాగితే.. ఆ ఒక్క పదవి కోసం తమ పోరాటం పలచబడుతుందని... తమకు ప్రజల నైతిక మద్దతును కూడగట్టుకోవాలంటే.. ఆయనతో పదవికి కూడా రాజీనామా చేయిస్తే బాగుంటుందని వైకాపా శ్రేణులు భావిస్తున్నాయి.