వీళ్లు కమ్యూనిస్టులా.. ‘కమ్మ’నిస్టులా..?

కమ్యూనిజానికి మతం లేదు.. అని అంటారు కమ్యూనిస్టు పార్టీ వాళ్లు. అయితే కమ్యూనిస్టు పార్టీ లోని సిక్కులు తమ మతాచారాలకు సంబంధించిన కట్టుబాట్లకు అనుగుణంగానే కనిపిస్తారు. అలాగే కమ్యూనిస్టు పార్టీల్లోని ముస్లిం నేతలు కూడా ముస్లిం ఫండమెంటలిస్టులకు ప్రతిరూపంలా ఉంటారు. ఎటొచ్చీ కమ్యూనిస్టు పార్టీల్లోని హిందువులే.. హిందూమతాన్ని కించపరిచే మాటలు మాట్లాడుతూ ఉంటారు, హిందూ మతాచారాలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారని.. కొంతమంది వాపోతూ ఉంటారు.

అయితే.. అలాంటి భయం తెలుగు కమ్యూనిస్టుల విషయంలో మాత్రం వదులుకోవాల్సిందే! ఎందుకంటే.. వీళ్లకు మతం సంగతేమో మాత్రం కులాభిమానం మాత్రం మెండుగా కనిపిస్తోంది. ప్రత్యేకించి గత రెండేళ్ల పరిణామాల్లో కమ్యూనిస్టుల తీరును బట్టి చూస్తే..  ప్రత్యేకించి ఏపీ వ్యవహారాల విషయంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీల్లోని ముఖ్యనేతలు .. వ్యవహరిస్తున్న తీరును బట్టి చూస్తే.. వీళ్లేనా, అసలు వీళ్లేనా.. కాంగ్రెస్ హయాంలో చిన్న చిన్న విషయాలకే అంత రచ్చ చేసింది? అనే అనుమానం కలుగుతుంది.

2004 నుంచి 2014 ల మధ్య కమ్యూనిస్టు పార్టీ నేతలు ప్రభుత్వాన్ని వణికించే వాళ్లు. ఎక్కడ చూసినా భూ పోరాటాలు, భూ సేకరణలకు, సెజ్ లకు వ్యతిరేకంగా ఆందోళనలు అనునిత్యం ఏదో ఒక పోరాటంతో వీళ్లు వార్తల్లోకి వచ్చేవాళ్లు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఖాళీ స్థలాలు కనిపించినా.. కమ్యూనిస్టు పార్టీ వాళ్లు అక్కడ టెంట్లు వేయించే వాళ్లు, ప్రభుత్వం ఏ ప్రాజెక్టుకు భూ సేకరణ చేపట్టినా.. సీపీఐ, సీపీఎంల ముఖ్య నేతలు అక్కడ వాలిపోయే వాళ్లు!

ఆఖరికి కడపలో బ్రహ్మిణీ స్టీల్స్ ఏర్పాటు విషయంలో కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి కదం తొక్కారు కమ్యూనిస్టు పార్టీ నేతలు. మరి అప్పుడు జరిగినదాన్ని ఇప్పుడు జరుగుతున్న దాంతో పోలిస్తే.. అది సముద్రంలో కాకి రెట్ట! ఉదయం లేస్తే ఏపీ ముఖ్యమంత్రి ప్రపంచాన్ని పట్టుకు తిరుగుతున్నారు. పెట్టుబడులు రాబట్టడం మాట అటుంచి.. ఈ పర్యటనల తతంగాన్ని తన ప్రచారం కోసం వాడుకుంటున్నాడు!

ఇక రాజధాని వ్యవహారానికి సంబంధంచిన భూ పందేరం గురించి వచ్చిన ఆరోపణల దగ్గర నుంచి విమానాశ్రయాల కోసమంటూ భూ సేకరణలు.. ఇప్పుడు బందరు పోర్టు విషయంలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు… ఇలాంటి పనులే వైఎస్ హయాంలో గనుక జరిగి ఉంటే.. కమ్యూనిస్టు పార్టీ నేతలు ఒక రేంజ్ లోరెచ్చిపోయే వాళ్లు! అయితే … రెండేళ్లలో అన్ని ప్రాజెక్టులకు, రాజధానికి కలిపి బాబు అండ్ కో రెండు లక్షల ఎకరాల భూమి సేకరిస్తున్నా.. ఇంత వరకూ గట్టిగా నోరు తెచ్చిన కమ్యూనిస్టుపార్టీ నేత కానీ, ఎక్కడైన ఒక్క చోట బాధితులతో కలిసి కూర్చున్న ఎర్రన్న కానీ లేడు!

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాబుతో కలిసి పోరాడటంపై వీళ్లు చూపిన శ్రద్ధలో వందో వంతు కూడా బాబు విధానాలపై పోరాడుతున్న దాఖలాలు కనపడటం లేదు. దీనికంతటికీ కారణమేమిటా.. అంటే, కమ్యూనిస్టు పార్టీల్లోని ముఖ్య నేతలకు బాబుపై ఉన్న అనురాగమే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

ఉభయ కమ్యూనిస్టు పార్టీల్లోని ముఖ్య నేతలంతా కమ్మ కులస్తులే, వీళ్లకు తెలుగుదేశం  ప్రభుత్వంలో ముఖ్య స్థానాల్లో ఉన్న కమ్మ వాళ్లతో సత్సంబంధాలు, బంధుత్వాలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో తమ స్వకులస్తుడైన బాబు సీఎంగా ఉన్నప్పుడు పోరాటాలు అంటూ ఆయన విధానాలను తప్పు పట్టడం వీళ్లకే ఇష్టం లేదు. ఓవరాల్ గా కమ్యూనిస్టులు కాస్తా, కమ్మ నిస్టులయ్యారు. దీంతోనే ఎర్ర పార్టీల ఉనికి ప్రశ్నార్థకం అయ్యిందని.. అంటూ ఆ పార్టీల్లోని కొంతమంది కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Show comments