కథ మళ్లీ మొదటికి...మన్నార్‌గుడి గుప్పిట్లోకి...!

తమిళనాడులో అన్నాడీఎంకే కథ చిత్రవిచిత్రమైన మలుపులు తిరుగుతోంది. ఊహించని పరిణామాలు సంభవిస్తున్నాయి. అన్నాడీఎంకే రెండు వర్గాలు విలీనం కాబోతున్నాయని, శశికళ కథ, మన్నార్‌గుడి మాఫియా స్టోరీ ముగిసిపోయాయని అందరూ అనుకున్నారు. 'శశికళ, దినకరన్‌ ఔట్‌' అనే పతాక శీర్షికలతో మీడియా హోరెత్తించింది. అన్నాడీఎంకేలోని రెండు వర్గాల చర్చలు ఫలవంతం అవుతున్నాయని, ఒప్పందాలు కుదిరాయని, అన్నాడీఎంకే పేరు, ఎన్నికల గుర్తు కూడా ఎన్నికల కమిషన్‌ తిరిగి ఇవ్వబోతున్నదని వార్తలొచ్చాయి. కాని కథ అడ్డం తిరిగింది. రెండు వర్గాల మధ్య చర్చలు స్తంభించాయి. సయోధ్య కుదరలేదు. పన్నీరు శెల్వం వర్గం కోరిక ప్రకారం శశికళను బయటకు పంపామని, దివాకరన్‌ లంచం కేసులో ఇరుక్కొని తనకు తానే దొరికిపోయాడని, పన్నీరు కోరిన ప్రకారం పార్టీ కార్యాలయంలో శశికళ బ్యానర్లు, ఫోటోలు తీసేశామని, అయినప్పటికీ ఇంకా గొంతెమ్మ కోరికలు కోరుతున్నారని సీఎం పళనిసామి వర్గం ఆరోపించింది. శశికళను, దినకరన్‌ను అధికారికంగా బహిష్కరించలేదని పన్నీరుశెల్వం వర్గం ఆరోపించింది. ముఖ్యమంత్రి పదవితో పాటు ప్రధాన కార్యదర్శి పదవి తనకే ఇవ్వాలని పన్నీరు డిమాండ్‌ చేసినట్లు వార్తలొచ్చాయి.

ఇలా అనేక రకాల పరిణామాల మధ్య విలీనం సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో పళనిసామి వర్గం మళ్లీ మన్నార్‌గుడి మాఫియాకు రెడ్‌ కార్పెట్‌ పరిచింది. ఎన్నికల గుర్తు 'రెండాకులు'ను రాబట్టుకునే విషయంలో శశికళ వాదనలను సమర్థిస్తూ పళనిసామి వర్గం ఎన్నికల కమిషన్‌కు అఫిడవిట్‌ సమర్పించింది. దినకరన్‌ కేసులో ఇరుక్కోవడంతో శశికళ తన అన్న కుమారుడిని పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా నియమించింది. విచిత్రమేమిటంటే ఇన్నాళ్లు ఎక్కడో దూరంగా ఉన్న శశికళ భర్త నటరాజన్‌, ఆయన సోదరుడు వి దివాకరన్‌ అన్నాడీఎంకేలో (శశి వర్గం) ప్రత్యక్షమయ్యారు. 2011లో జయలలిత పోయెస్‌ గార్డెన్‌ నుంచి తరిమేసిన 14 మంది మన్నార్‌గుడి మాఫియా గ్యాంగులో నటరాజన్‌, దివాకరన్‌ కూడా  ఉన్నారు. అప్పటి నుంచి శశికళ తప్ప వేద నిలయంలో వేరేవారికి చోటు లేకుండా పోయింది. అప్పుడు బయటకు వెళ్లిన గ్యాంగంతా మళ్లీ చేరుకుంటోంది.

జయలలిత చనిపోయినప్పుడు పళనిసామి ముఖ్యమంత్రిగా ఉండగా, ఆయన్ని దింపి తాను ఆ కుర్చీలో కూర్చోవాలని శశి ప్రయత్నాలు చేసింది. ఆ సమయంలో నటరాజన్‌ 'పళనిసామి బాగా పనిచేస్తున్నారు. మార్చడం అనవసరం' అని బహిరంగంగానే అన్నారు. ఇప్పుడాయన పార్టీలోకి ప్రవేశించారు. పార్టీ పత్రిక 'నమదు ఎంజిఆర్‌'లో నటరాజన్‌, దివాకరన్‌ కొందరు మంత్రులతో కలిసి వున్న ఫోటోలు ప్రముఖంగా ప్రచురితమయ్యాయి. 'నమదు ఎంజీఆర్‌' ప్రచురించే జయ పబ్లికేషన్స్‌లో శశికళ భాగస్వామి. ఇప్పటికీ దాని యజమాని ఆమేనని పత్రిక సిబ్బంది చెప్పారు. జీతాలు చిన్నమ్మే ఇస్తున్నారు. ఇక అన్నాడీఎంకే అధికారిక టీవీ ఛానెల్‌ 'జయ టివి'. మన్నార్‌గుడి మాఫియా ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ టివి ఛానెల్‌ బాధ్యతలు తాజాగా  శశికళ అన్న కుమారుడు వివేక్‌ జయరామన్‌ (ఈయన తల్లి ఇళవరసి ప్రస్తుతం శశికళతోపాటు జైల్లో ఉంది) తీసుకున్నట్లు సమాచారం.

శశికళను పార్టీ నుంచి బహిష్కరించాలన్న పన్నీరు శెల్వం డిమాండ్‌ను పళనిసామి పట్టించుకోలేదని పన్నీరు వర్గానికి చెందిన ఓ నాయకుడు చెప్పాడు. ఈమధ్య వరకు అంటే దినకరన్‌ అరెస్టు కాకముందు వరకు ఆయన్ని పార్టీ వదిలిపోవాలని పళనిసామి వర్గం నాయకులు డిమాండ్‌ చేశారు. కొందరు మంత్రులు ఆయన ఇంటికి వెళ్లి 'మీరు రాజీనామా చేయకపోతే మేమే బయటకు పంపుతాం' అని హెచ్చరించారు కూడా. కాని తాజాగా గళం మారింది. దినకరన్‌ అరెస్టు అన్యాయం, అక్రమం అంటున్నారు. ఆయనపై తప్పుడు ఆరోపణలు చేసి కేసులో ఇరికించారని చెబుతున్నారు. సో... అన్నాడీఎంకేలో కథ మళ్లీ మొదటికి వచ్చి పార్టీ మన్నార్‌గుడి మాఫియా గుప్పిట్లోకి వెళ్లిపోయింది. ఇక ముందు ఏం జరుగుతుందో...!

Show comments