వెనుకటికి కూడా తెలుగుదేశం పార్టీతో బీజేపీ స్నేహం చేసింది.. ఇరు పార్టీలూ మిత్ర పక్షాలుగా చెలామణి అయ్యాయి కానీ.. కమలం పార్టీ మరీ ఇంతలా కుంచించుకుపోలేదు. జాతీయ పార్టీలా కాకుండా.. క్రమంగా తెలుగుదేశం పార్టీకి తోక పార్టీలా మారిపోయింది బీజేపీ.
1999- 2004ల నాటి పరిస్థితులనే ఒకసారి గమనిస్తే.. అప్పట్లో అక్కడక్కడ తెలుగుదేశం నేతలతో కొంతమంది బీజేపీ నేతలు ఢీ అంటే ఢీ అనే వాళ్లు! కమలం పార్టీ అక్కడక్కడైనా తమ ఉనికిని చాటుకునేది. తెలుగుదేశానికి మిత్రపక్షమే అయినా.. కొన్ని కొన్ని విషయాల్లో కమలం పార్టీ తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పేది.. క్రియాశీలకంగా వ్యవహరించేది. అయితే.. బీజేపీలోకి చేరి వచ్చిన ఒక సామాజికవర్గం నేతలు, ప్రత్యేక హోదాపై ఆ పార్టీ వ్యవహరణ తీరు.. ఈ రెండు అంశాలూ కమలం పార్టీ ఉనికిని ఏపీలో ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ప్రత్యేకహోదా వద్దని, ప్యాకేజీతో సంతృప్తి పడిపోవడంతో బాబుపై ఇప్పుడు కమలానికి మరీ ప్రేమ ఎక్కువైపోయింది!
మరి ఇలాంటి బీజేపీకి ఇప్పుడు ఉన్నట్టుండి రైతులు గుర్తుకు వచ్చారు! రైతాంగ సమస్యలపై ఉద్యమించాలని.. రుణమాఫీ తో సహా వివిధ అంశాలపై ప్రభుత్వం తీరును ఎండగట్టాలని కమలం పార్టీ డిసైడ్ చేసింది! మరి ఇదేంటి? అంటే… ఇలా డిసైడ్ చేసింది బీజేపీ ఏపీ విభాగం కాదు.. తెలంగాణ విభాగం!
కేసీఆర్ రైతులను మోసం చేశాడని, రైతాంగ వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాడని బీజేపీ అంటోంది. ఈ విషయంపై నిరసన తెలుపుతామని అంటోంది. రోడ్డు ఎక్కుతామని అంటోంది! ఎన్నికల హామీ ఇచ్చినట్టుగా ఒకేసారి రైతాంగ రుణమాఫీ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది!
భలే ఉంది కదా.. బీజేపీ డ్యూయల్ రోల్. తను మాత్రం ఎన్నికల హామీలను నెరవేర్చదు. ఏపీ విషయంలో ఒకటికి వంద సార్లు చెప్పిన ప్రత్యేకహోదా అంశంపై బీజేపీ ప్లేటు ఫిరాయిస్తుంది. ఇలాంటి మోసాన్ని ఇతర పార్టీలు చేస్తుంటే బీజేపీ రోడ్డు ఎక్కుతుందట! ఏ మొహం పెట్టుకుని ఎక్కుతుందో!
ఇక రుణమాఫీ విషయంలో మోసపోయింది తెలంగాణ రైతులే కాదు.. ఏపీ రైతులు కూడా ఈ విషయంలో దారుణంగా మోసపోయారు. మాఫీ విషయంలో బాబు అప్పుడు చెప్పింది ఏమిటి? ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? ఇక పట్టిసీమ ప్రాజెక్టు ను బీజేపీ మొన్నటి వరకూ ఎంతగా వ్యతిరేకించింది?
తెలంగాణలో కేసీఆర్ భూ సేకరణ తో రైతులకు అన్యాయం చేస్తున్నాడని అంటున్న కమలం పార్టీ.. ఏపీ జరుగుతున్న వ్యవహారాల గురించి నోరు మెదపడం లేదు!
మరి నీతి, నిజాయితీ.. నైతిక విలువలు, భారతీయత అంటూ మాట్లాడే కమలం నాథులు మరీ ఇంత బరితెగింపు రాజకీయాలు చేస్తున్నారే? ఈ అవమానం ఎవరికి? వీళ్లకు ఆ విలువలు బోధించిన వారికా? కాషాయం కట్టుకుని కొంతమంది బాబాలు చేస్తున్న పాడు పనులతో కమలం పార్టీ తీరు ఏమీ తీసిపోవడం లేదు. వీళ్లది రాజకీయ వ్యభిచారం అంతే!