'వీధీ పోరాటాలు కాదు.. ఢిల్లీకి వెళ్ళి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి..'
- ఇదీ ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కేంద్ర మంత్రి సుజనా చౌదరి విసిరిన సవాల్.
కామెడీ కాకపోతే, కేంద్రంలో తామే అధికారంలో వున్నామన్న విషయాన్ని మర్చిపోయి, కేంద్రం మీద ప్రతిపక్షాన్ని పోరాడమంటారేంటి సుజనా చౌదరి.? అసలాయనకి మతి వుండే మాట్లాడుతున్నారా.? ఇలా జనం ఏమనుకుంటే, ఆయనకేంటి.! ఆయన అనుకున్నది మాట్లాడతారంతే.
సరే, సుజనా చౌదరి సవాల్ విసిరారు.. ఆ సవాల్‌కి స్పందించారో, ముందే స్కెచ్ ప్రిపేర్ చేసుకున్నారో.. ఏదైతేనేం, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ ఫిక్స్ చేసేసుకున్నారు. రేపు ఆయన ఢిల్లీకి వెళతారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుస్తారు. ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రపతికి, వైఎస్సార్సీపీ ఎంపీలతో కలిసి ఓ లేఖ ఇవ్వనున్నారు వైఎస్ జగన్. రాజ్యసభ సాక్షిగా నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇచ్చినా, దాన్ని ప్రస్తుత నరేంద్రమోడీ ప్రభుత్వం అమలు చేయడంలేదని వైఎస్ జగన్, రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.
సుజనా చౌదరి కోరుకున్నట్లే జగన్ వీధి పోరాటాలు (ఆంధ్రప్రదేశ్‌లో నిరాహార దీక్షలు, ఆందోళనలు, బంద్‌లు) పక్కన పెట్టి, ఢిల్లీ పోరాటానికి సమాయత్తమయ్యారు. మరి, సుజనా చౌదరి తెలుగుదేశం పార్టీలోని ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్న నేతలందర్నీ (అదేనండీ, బొండా ఉమామహేశ్వరరావు విజయవాడలో బీజేపీ కార్యాలయం ముందు రోడ్లు ఊడ్చారు కదా.. కార్లు తుడిచారు కదా.! ఇంకోపక్క టీడీపీ నేత ధూళిపాళ్ళ నరేంద్ర ఉదయం నుంచీ సాయంత్రం దాకా దీక్ష చేశారు కదా..) ఢిల్లీకి తీసుకెళ్ళి, అక్కడ ఆందోళనలు చేయించి, కేంద్రంపై ఒత్తిడి తీసుకురాగలరా.? ఆ చిత్తశుద్ధి సుజనాకి వుందా.?
కేంద్ర మంత్రి హోదాలో సుజనా చౌదరి, ఇప్పుడు ప్రతిపక్షాన్నీ, తమ పార్టీకి చెందిన ముఖ్య నేతల్నీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చి, ఢిల్లీ వేదికగా ప్రత్యేక హోదాకి అనుకూలంగా జరిగే పోరాటానికి మద్దతివ్వగలిగితే, ఆయన తన చిత్తశుద్ధిని చాటుకున్నట్లవుతుంది. అఫ్‌కోర్స్, చిత్తశుద్ధి అన్న పదానికి అర్థం ఆయనకు తెలియదనుకోండి.. అది వేరే విషయం.
కనీసం, సుజనా చౌదరి.. వైఎస్ జగన్ బృందానికి ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్ ఇప్పించగలరా.? కనీసం, అరుణ్ జైట్లీ అపాయింట్‌మెంట్ ఇచ్చి అయినా తన చిత్తశుద్ధిని చాటుకోగలరా.? ఇవన్నీ చేయలేకపోతే, ఇంకోసారి సుజనా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురించి విమర్శలు చేసే నైతిక హక్కుని కోల్పోయినట్లే.