వర్మ ఏడుస్తోంటే.. 'ఖైదీ' నవ్వుతున్నాడు

ఓ సినిమాని పొగడాలంటే, ఇంకో సినిమాని తెగడాలి.. ఒకర్ని మెచ్చుకోవడానికి, ఇంకొకర్ని కించపర్చాలి.. ఇది సంచలన దర్శకుడిగా ఒకప్పుడు ప్రేక్షకుల మన్ననలు అందుకున్న రామ్‌గోపాల్‌ వర్మ తాజా థియరీ. 

'ఖైదీ నెంబర్‌ 150' సినిమానీ, 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమానీ.. చిరంజీవినీ, బాలకృష్ణనీ.. తనకు నచ్చిన రీతిలో పోల్చి చూస్తున్నాడు వర్మ సోషల్‌ మీడియాలో. వర్మ ట్విట్టర్‌ పిట్ట కూతలకి హద్దూ అదుపూ లేకుండా పోవడంతో, మెగా క్యాంప్‌ నుంచి నాగబాబు ఘాటుగా స్పందించిన విషయం విదితమే. నాగబాబు స్పందనని (తిట్ల పురాణం) మెగాస్టార్‌ చిరంజీవే స్వయంగా సమర్థించడం గమనార్హం. 

అయినా, వర్మ సోషల్‌ మీడియాలో 'ఏడుపు' మాత్రం మానడంలేదన్నది వర్మ తాజా ట్వీట్ల తర్వాత మెగా క్యాంప్‌ నుంచి వస్తోన్న టాక్‌. వర్మ ఏడుస్తున్నాడంటే.. దానర్థం, 'ఖైదీ' నవ్వుతున్నాడనే కదా.! ఏడ్చేవాళ్ళు ఏడ్వనీ.. సినిమానే ఆ ఏడుపుకి సమాధానమిస్తుందంటూ సోషల్‌ మీడియాలోనే మెగాభిమానులు సందడి చేస్తున్నారు. 

ఎవరి గోల వారిది. వర్మకి ఇలాంటి వివాదాలు కొత్త కాదు. వర్మ ట్వీట్లు.. రీ ట్వీట్లు అవుతోంటే, ఆయనకు అదో 'తుత్తి'. వర్మ ఉత్తనే ఏ వివాదాన్నీ రాజేయడు. ఈ మొత్తం వివాదం వెనుక వర్మ పెద్ద స్ట్రాటజీనే అమలు చేస్తుండొచ్చు. అదేంటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌. ఒక్కటి మాత్రం నిజం, 'మెగా' పేరు చెప్పి వర్మ, విపరీతమైన పబ్లిసిటీ పొందుతున్నాడు. అయినా, వర్మకి ఈ పబ్లిసిటీ స్టంట్లు అవసరమా.? అంటే, ఈ మధ్యకాలంలో సినిమాలకన్నా పబ్లిసిటీ స్టంట్లతోనే కదా వర్మ పాపులారిటీ పొందుతున్నది.!! 

Readmore!

ఏదిఏమైనా, సోషల్‌ మీడియాలో నోటికొచ్చిన పోస్టింగ్స్‌ పెట్టడం, వాటి ద్వారా ఎవరో ఒకర్ని కెలకడం, అట్నుంచి మళ్ళీ కామెంట్లను ఎదుర్కోవడం, కొన్నిసార్లు తిట్లు తినడం.. ఇదంతా సంచలనాల రామ్‌గోపాల్‌ వర్మకి తగునా.? 'శివ', 'సర్కార్‌' లాంటి లెక్కలేనన్ని సంచలనాలు తెరకెక్కించిన వర్మనేనా, ఇలా ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఉతికి ఆరేస్తున్నది.? ఆయనేనా ఇలా వివాదాల కోసం పాకులాడుతున్నది.? ఏం చేస్తాం, అదంతే.!

Show comments