ప్రత్యేక హోదా - కరెన్సీ నోటు.. పవన్ దారెటు.!

బీజేపీని విమర్శించడం మామూలే.. పనిలో పనిగా టీడీపీపైనా సెటైర్లు వేయొచ్చుగాక. ఇంతేనా, ఇంతకు మించి పవన్‌కళ్యాణ్‌ అనంతపురంలో నిర్వహిస్తున్న బహిరంగ సభలో ఇంకేమన్నా విశేషాలుంటాయా.? నల్లధనం మీద పవన్‌కళ్యాణ్‌ మాట్లాడతారా.? జనసేన పార్టీని బలోపేతం చేసే విషయమై ఏమైనా సంకేతాలు ఇస్తారా.? ఇలా రకరకాల ప్రశ్నలు అభిమానుల మెదళ్ళను తోచేస్తున్నాయి. 

నిజానికి, పెద్ద నోట్ల రద్దుతో పవన్‌కళ్యాణ్‌ అనంతపురం జిల్లాలో తలపెట్టిన బహిరంగ సభ రద్దవుతుందని అంతా అనుకున్నారు. కానీ, తన స్పీచ్‌లో పవన్‌కళ్యాణ్‌ చిన్న చిన్న మార్పులు చేసుకుని, సభని యధాతథంగా నిర్వహించడానికే మొగ్గు చూపారు. అయితే, అనుకున్న విధంగా అనంతపురం - జనసేన సభకి హైప్‌ కనిపించడంలేదు. దేశమంతా కరెన్సీ రద్దు ప్రకంపనల నేపథ్యంలో మీడియా ఫోకస్‌ పూర్తిగా అక్కడే వుండిపోయింది. 

ఇప్పుడు దేశంలో కరెన్సీ మార్పిడి తప్ప ఇంకో కీలక అంశం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో అయినా అంతే. ప్రత్యేక హోదా అంశం ఎప్పుడో అటకెక్కేసింది. అది ముగిసిన అధ్యాయం.. అని కేంద్ర మంత్రి, పవన్‌కళ్యాణ్‌ సన్నిహితుడు (అవును మరి, పవన్‌కళ్యాణ్‌తో బీజేపీ తరఫున సంప్రదింపులు జరిపి 2014 ఎన్నికల్లో బీజేపీకి జనసేన సపోర్ట్‌ సంపాదించినవారిలో ఆయనే ముఖ్యుడు) తేల్చి చెప్పేశారు. దాంతో, ఇప్పుడు పవన్‌కళ్యాణ్‌ నేరుగా వెంకయ్యనాయుడినే టార్గెట్‌ చేయాలిగానీ, చేయడం వల్ల ఉపయోగం లేదు. పైగా, 'పాచిపోయిన లడ్డూలు' అని కాకినాడ సభలో పవన్‌ విసిరిన సెటైర్లకు, వెంకయ్య చాలా గట్టిగానే సమాధానమిచ్చారు. 

ఇదిలా వుంటే, పవన్‌కళ్యాణ్‌ అభిమానులు మాత్రం అనంతపురం సభకు భారీగానే తరలి వచ్చారు. పోలీసుల ఓవరాక్షన్‌ ఎక్కువైపోయిందంటూ అభిమానులు గుస్సా అవుతున్నా, ఎలాంటి అపశ్రుతులు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన క్రమంలో చిన్న చిన్న సమస్యలు తప్పవనీ, వస్తున్నవారంతా యువతే గనుక.. ఆవేశకావేశాలు వుంటాయనీ, వారి కోసమే కఠిన నిర్ణయాలు తప్పడంలేదన్నది పోలీసుల వాదన. 

Readmore!

మొత్తమ్మీద, ఇప్పటికే అనంతపురం చేరుకున్న పవన్‌, కాస్సేపట్లో బహిరంగ సభ వేదికపైకి రానున్న దరిమిలా, జనసేన - అనంతపురం సభ ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది.? అసలు జనసేనకి ఈ సభ ఎంత మేరకు ఉపయోగపడ్తుంది.? అన్నది వేచి చూడాల్సిందే.

Show comments