రెడ్డి వర్సెస్ చౌదరి.. ఆటంకాల్లో పోటాపోటీ!

ఎంపీ ల్యాడ్స్ ను ఓల్డ్ టౌన్ లో రోడ్డు విస్తరణకు వాడతానని దివాకర్ రెడ్డి ప్రతిపాదించాడు. అంతే..ఈ  విషయంలో ప్రభాకరచౌదరి నుంచి అభ్యంతరం వ్యక్తం అయ్యింది.  వాస్తవానికి అనంతపురం ఓల్డ్ టౌన్ లో రోడ్డు చాలా ఇరుకుగా ఉంటుంది. ఎప్పుడో నిర్మించిన రోడ్డు కావడం, విస్తరణకు నోచుకోకపోవడం, వ్యాపారస్తులు రోడ్లను పూర్తిగా బ్లాక్ చేసేస్తుండటంతో కనీసం మోటర్ బైక్ లో ఆ రోడ్డు మీద వెళ్లడం కూడా కష్టమే. రోడ్డు విస్తరణ ఎంతైనా అవసరం ఉందక్కడ. 

అయితే దివాకర్ రెడ్డి కి ఈ విస్తరణ తో ఎక్కడ పేరు వస్తుందో అని ప్రభాకర్ చౌదరి అడ్డం పడ్డాడు. అక్కడి వ్యాపారస్తులను కోర్టుకు పంపించాడు. వాళ్లతోనే తలా ఐదారు వేలు సేకరించి ఆ మొత్తంతో ఈ విస్తరణను అడ్డుకోవడానికి కోర్టుకు ఎక్కించాడు ప్రభాకర్ చౌదరి అని జేసీ వర్గం గట్టిగా ఆరోపిస్తోంది. ఆ వివాదంతో పాతూరులో రోడ్డు విస్తరణ అలా అటక ఎక్కింది. ఇక అంతలోనే రామ్ నగర్ ఫ్లై ఓవర్ వివాదం తలెత్తింది. ఈ విషయంలో జేసీ , ప్రభాకర్ చౌదరిలు గట్టిగానే తగవులాడారు. దాని కథ ఎక్కడికి తేలుతుందో అర్థం కావడం లేదు.ఇంతలోనే డివైడర్లు అంటూ మళ్లీ గొడవేసుకున్నారు. 

సప్తగిరి సర్కిల్ పాత డివైడర్లను తలొగించి కొత్త వాటిని నిర్మించడానికి..రోడ్డు అంతా తవ్వి పెట్టారు. ఈ కందకాలతో అసలే ఇరుకుగా ఉండే ఆ రోడ్డు మరింత కుంచించుకుపోయింది. దీంతో టౌన్ కు మెయిన్ రోడ్డులో ప్రయాణం మరింత ఇబ్బందిగా మారింది. మరి ఈ డివైడర్ల వివాదం ఎప్పటికి సద్దుమణుగుతుందో అర్థం కావడం లేదు. పాత డివైడర్లను తొలగించి కొత్త వాటిని ఏర్పాటు చేయాలని ప్రభాకర్ చౌదరి భావిస్తుంటే.. ఉన్నవాటిని తొలగించడం ఎందుకు అని జేసీ స్టార్ట్ చేశాడు. 

తను ఓల్డ్ టౌన్ రోడ్డును విస్తరించాలని ప్రతిపాదిస్తే అడ్డుకున్న ప్రభాకర్ చౌదరిపై జేసీ ఇలా స్టార్ట్ చేశాడు. ఈ డివైడర్ల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ దివాకర్ రెడ్డి ధర్నాకు కూడా రెడీ అవుతున్నాడట. వీరిద్దరి మధ్య తగవును తీర్చడానికి ఇప్పుడు జిల్లా తెలుగుదేశం లీడర్లు రంగంలోకి దిగారు! మొత్తానికి టీడీపీ నేతలు ఒకరి ప్రోగ్రామ్ కు మరొకరు ఆటంకాలు కల్పించడంలో మాత్రం ముందున్నారు! 

Show comments