బీ అలర్ట్‌: వచ్చేస్తున్నాయ్‌ దొంగనోట్లు.!

దేశవ్యాప్తంగా సరిపడా కరెన్సీని తయారు చేయాలంటే అది అంత తేలికైన విషయం కాదు. అదే, నకిలీ నోట్లకైతే.. ఆ సమస్యే లేదు. మార్కెట్‌లోకి కొత్త 2వేల రూపాయల నోటు వచ్చిన వెంటనే, దాన్ని జిరాక్స్‌ తీసేసి కొందరు మార్కెట్‌లోకి తీసుకొచ్చేశారు. అఫ్‌కోర్స్‌.. వెంటనే దొరికేశారనుకోండి.. అది వేరే విషయం. ఈ ఘనకార్యం తెలంగాణలోనే ముందుగా వెలుగు చూసింది. 

ఇక, ఫేక్‌ కరెన్సీ మీదనే ఆధారపడే పొరుగుదేశాలు ఖాళీగా వుంటాయా.? ప్రింటింగ్‌ షురూ చేసేశాయి. 2000 నోట్ల రూపాయలతోపాటు, 500 రూపాయల నోట్లని కూడా ప్రింట్‌ చేసేసి, దేశంలోకి ఇప్పటికే తరలించేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత కొద్ది రోజులుగా కాశ్మీర్‌లో అల్లర్లు తగ్గడానికి ఈ కరెన్సీ వ్యవహారమే కారణం. పెద్ద నోట్లను కేంద్రం రద్దు చేయడంతో, ఒక్కసారిగా కాశ్మీర్‌లోని వేర్పాటువాదులకు ఫండింగ్‌ ఆగిపోయింది. 

అయితే, ఇప్పుడిప్పుడే వేర్పాటువాదులకు నకిలీ కరెన్సీ అందుబాటులోకి వస్తుండడంతో, మళ్ళీ కాశ్మీర్‌లో కాక రేగుతోందనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. మరోపక్క, కొత్త 2000, 500 నోటు ఫీచర్లకు సంబంధించి ఇంకా సామాన్యుల్లో పూర్తిస్థాయి అవగాహన రాలేదు. మీడియాలో ప్రచారం జరుగుతున్నాసరే, ఎవరన్నా 2000 నోటు తీసుకొస్తే, 'ఇది పిల్లలు ఆడుకునే పేపర్‌ మనీ కదా..' అంటున్నారు చాలామంది. ఇది కాస్తంత ప్రమాదకరమైన విషయమే. 

పెద్ద నోట్లను రద్దు చేసినట్లే చేసి, అంతకన్నా పెద్దనోటును తీసుకురావడంపై మొదటినుంచీ విమర్శలు వెల్లువెత్తుతూనే వున్నాయి. 2000 రూపాయల నోటు కాకుండా, 500 నోటుని తీసుకొచ్చి వుంటే బావుండేదనీ, ముందస్తుగా 100 రూపాయల నోట్లని అందుబాటులోకి తెచ్చి వుంటే సాధారణ ప్రజల కష్టాలు తగ్గేవన్న వాదనలు బలం పుంజుకుంటున్నాయి. 

అయినాసరే, నిర్ణయం జరిగిపోయింది.. అది అమల్లోకి వచ్చేసింది.. దేశవ్యాప్తంగా కరెన్సీ కష్టాలు ఓ పక్క, అదే సమయంలో ఫేక్‌ కరెన్సీ ఇంకోపక్క.. వెరసి, నోట్ల రద్దు వ్యవహారం సత్ఫలితాలనిస్తుందా.? అనే అనుమానాలు తలెత్తడం సహజమే కదా. ఏదిఏమైనా, ఫేక్ కరెన్సీ చెలామణీలోకి వచ్చేస్తే.. అదీ ఉగ్రమూకల ద్వారా అయితే, 125 కోట్ల భారత ప్రజానీకం త్యాగాలు ఏమైపోవాలి.?

Show comments