లేడీ గెటప్‌తో కొల్లగొట్టేస్తాడా.?

తమిళ సినిమాలు తెలుగు తెరపై సత్తా చాటడం కొత్త విషయమేమీ కాదు. సినిమాలో కంటెంట్‌ వుంటే, చిన్న సినిమా అయినాసరే పెద్ద విజయం సాధిస్తుందని ఇటీవలే 'బిచ్చగాడు' సినిమా నిరూపించింది. అదే సమయంలో, ఎంత పబ్లిసిటీ చేసినా కంటెంట్‌ లేకపోతే, అంతే సంగతులు.. అని చాలా సినిమాలు నిరూపించాయనుకోండి.. అది వేరే విషయం. 

ఇక, అసలు విషయానికొస్తే, 'రెమో' సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. శివ కార్తికేయన్‌ ఈ సినిమాలో హీరోగా నటించాడు. లేడీ గెటప్‌ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు. లేడీ గెటప్‌ అంటే ఏదో ఆషామాషీగా వేసెయ్యలేదు. అచ్చం అమ్మాయిలా కనిపించాడు శివ కార్తికేయన్‌. మరోపక్క, ఈ సినిమాలో హీరోయిన్‌గా 'నేను శైలజ' ఫేం కీర్తి సురేష్‌ నటించింది. ప్రస్తుతం కీర్తి పవన్‌ సరసన ఓ సినిమాకి కమిట్‌ అయ్యింది. మహేష్‌ సరసన కూడా కీర్తికి ఆఫర్‌ వచ్చిందనీ, అది ఖరారయ్యిందనీ ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. 

దిల్‌ రాజు ఈ చిత్రాన్ని తెలుగులోకి రిలీజ్‌ చేస్తుండడంతో సహజంగానే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. పబ్లిసిటీ కూడా అదరహో అనే రేంజ్‌లో చేస్తుండడం 'రెమో'కి పెద్ద ప్లస్‌ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైనింగ్‌ కథాంశంతో 'రెమో' తెరకెక్కిందంటూ సినిమా ప్రమోషన్‌లో తెగ సందడి చేస్తున్నాడు హీరో శివ కార్తికేయన్‌. చూద్దాం.. లేడీ గెటప్‌తో టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ని ఈ వారం శివ కార్తికేయన్‌ షేక్‌ చేసేస్తాడేమో.!

Show comments