లే.. పంగా.. ఇక ఇంటర్నేషనల్‌.!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ కిక్కు తగ్గింది.. ఇప్పుడంతా పీకేఎల్‌ ఫీవర్‌ కనిపిస్తోంది. ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ ప్రో కబడ్డీ లీగ్‌ గురించిన చర్చే జరుగుతోంది. సీజన్‌ సీజన్‌కీ పాపులారిటీ పెంచుకుంటూ పోతోన్న కబడ్డీ గేమ్‌, ఇకపై అంతర్జాతీయ స్థాయిలో కబడ్డీ అభిమానుల్ని అలరించనుంది. అవును, ఇంటర్నేషనల్‌ కబడ్డీ లీగ్‌ను అక్టోబర్‌లో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. 

ఏమో, కాలం కలిసొచ్చి.. క్రికెట్‌ని మించి కబడ్డీకి రానున్న రోజుల్లో పాపులారిటీ పెరగొచ్చేమో. క్రికెట్‌ చూడాలంటే ఐదు రోజులు టెస్ట్‌ చూడాలి.. లేదంటే, ఒక రోజు వన్డే మ్యాచ్‌ చూడాలి.. అదీ కాదంటే, ఓ మూడు నాలుగు గంటలపాటు టీ20 మ్యాచ్‌ గురించి చూడాలి. కానీ, జస్ట్‌ 40 నిమిషాలల్లో హై ఓల్టేజ్‌ యాక్షన్‌ చూడాలంటే మాత్రం బెస్ట్‌ ఛాయిస్‌ కబడ్డీనే. 

క్షణ క్షణానికీ ఉత్కంఠ రేపడం కబడ్డీకే చెల్లింది. ప్రో కబడ్డీ లీగ్‌ పేరుతో జరుగుతోన్న కబడ్డీ పోటీలకు ఫాలోయింగ్‌ ఏ రేంజ్‌లో వుందో క్రికెట్‌ బ్యాట్‌, బాల్‌ వదిలేసి వీధుల్లో 'లే పంగా..' అంటూ తొడలు కొడ్తున్న చిన్నారుల్ని అడిగితే తెలుస్తుంది. 'సూపర్‌ టాకిల్‌.. సూపర్‌ రైడ్‌..' వంటి పదాల వాడకం ఇప్పుడు చిన్న పిల్లల్లో క్రేజీ అయిపోయింది. మహిళలు సైతం ఆసక్తిగా తిలకిస్తున్న గేమ్‌ ఇది. ఇంతలా కబడ్డీ జనంలోకి వెళ్ళడం కోసం ప్రో కబడ్డీ నిర్వాహకులు చేసిన, చేస్తున్న ప్రయత్నం చిన్నదేమీ కాదు. 

కబడ్డీ ఓ ఆట మాత్రమే కాదు.. అది మన సంప్రదాయం కూడా. మానసిక ఉత్తేజం, శారీరక దారుఢ్యం.. ఇవన్నీ కబడ్డీతో సాధ్యమవుతాయంటారు కబడ్డీ ప్లేయర్స్‌. పేరున్న క్రికెటర్లతో అప్పుడే పోల్చేయలేంగానీ, మంజీత్‌ చిల్లర్‌, అనూప్‌ కుమార్‌, రోహిత్‌ కుమార్‌, పర్‌దీప్‌ నర్వాల్‌, జస్వీర్‌సింగ్‌.. తదితరులంతా ఇప్పుడిప్పుడే కబడ్డీ స్టార్లుగా దేశవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు అందుకుంటున్నారు. 

ప్రస్తుతానికి ఇండియాకే పరిమితమైన ఈ ప్రో కబడ్డీ లీగ్‌, ఇకపై అంతర్జాతీయ స్థాయిలో అలరించనుండడమంటే ఆ కిక్కే వేరప్పా. బాలీవుడ్‌ సెలబ్రిటీలు కబడ్డీని ప్రమోట్‌ చేస్తూ, తమ సినిమాల ప్రమోషన్‌కి కబడ్డీ పోటీలను వేదికగా చేసుకోవడం అభినందనీయమే కదా.

Show comments