ఒకవైపు సాక్షిని బహిష్కరించామని తెలుగుదేశం అధినేత స్వయంగా చాలా సార్లు ప్రకటించారు. మరోవైపు ‘సాక్షి’ ని స్వాధీనం చేసుకొంటామని కూడా అప్పుడప్పుడు అంటూ ఉంటారు. ఇలా ఎన్ని మాట్లాడినా ఉదయం లేస్తే ఆయన సాక్షి పేపర్ ను ఆసాంతం చదువుతున్నాడని మాత్రం స్పష్టం అవుతోంది. సాక్షిని చదవద్దు తమ్ముళ్లూ అంటూ పిలుపులిస్తూనే తెలుగుదేశం అధినేత ‘సాక్షి’ లో వచ్చిన వార్తలను తన ప్రసంగాల్లో ప్రస్తావిస్తున్నారు! అది కూడా ఎప్పటికప్పుడు అప్ టూ డేట్ గా.. ఏ రోజు వార్తా కథనాల గురించి ఆ రోజు స్పందిస్తున్నారు ఏపీ సీఎం!
సదావర్తి భూముల కుంభకోణంపై తాము విసిరిన సవాల్ కు స్పందన వచ్చిన ప్రతిపాదనల పట్ల తామే పెట్టిన కొర్రీలను సాక్షి హైలెట్ చేయడంపై బాబు మండి పడ్డారు. తాము వేలానికి సిద్ధమని ప్రకటన చేస్తే.. షరతులను హైలెట్ చేస్తోందని బాబు సాక్షిని విమర్శించారు. ఏదేమైనా.. అన్నీ ఉన్నా, ఏపీ ముఖ్యమంత్రికి జగన్ పత్రిక ప్రశాంతత లేకుండా మాత్రం చేస్తున్నట్టుగా ఉంది.
వెనుకటికి వైఎస్ కూడా ఆ రెండు పత్రికలూ అంటూ.. జ్యోతి, ఈనాడుల మీద చాలా సార్లు విమర్శలు చేశారు. అయితే అప్పటికి వైఎస్ కు అనుకూల మీడియా అంటూ లేదు! కేవలం వ్యతిరేక మీడియా మాత్రమే ఉంది. ఈనాడు, జ్యోతిలను తమ శత్రుపత్రికలు అని ప్రకటించిన వైఎస్.. సాక్షి పత్రిక వస్తున్నప్పుడు ‘మా పత్రిక వస్తోంది..’ అని గొప్పగా ప్రకటించుకున్నాడు కూడా! సాక్షి వచ్చిన తర్వాత ఈనాడు, జ్యోతిల మీద విమర్శలు చేయడాన్ని పూర్తిగా మానేశారు వైఎస్.
కానీ బాబుకు మాత్రం అప్పటికి, ఇప్పటికీ.. ఎప్పటికీ, మొత్తంగా దాదాపు ఇరవై లక్షల సర్క్యులేషన్ ఉన్న రెండు పత్రికలు, అనుకూలంగా మాత్రమే పని చేసే డజను ఛానళ్లు…ఉన్నా కూడా, ఇంకా ‘సాక్షి’ మీద విరుచుకుపడుతూనే ఉన్నారు.
ఒకవైపు సాక్షిని చదవొద్దు.. చదవొద్దూ అంటూ తమ్ముళ్లకు పదే పదే పిలుపునిస్తూ తను మాత్రం తప్పకుండా చదువుతూ.. ఆ పత్రికను విమర్శించడానికి రోజులో కొంత సమయాన్ని కేటాయిస్తున్నాడు తెలుగుదేశాధినేత. ఇది చంద్రబాబు విజన్.