చంద్రబాబుకు పవన్ ఝలక్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా తెలివిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ఎప్పటికైనా తమతో వస్తాడేమో అన్న భ్రమలో వున్న భాజపాకు భలే ఝలక్ ఇచ్చాడు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఇంత రగడ జరుగుతున్నా... జనం కోసం తానున్నానని, ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని గొప్పలకు పోయిన పవన్ కళ్యాణ్ కన్పించడేమి అని మీడియా నిలదీస్తున్నా, అమావాస్య కోసారి, పున్నమి కోసారి అలా వచ్చి ఏదో ఓటి మాట్లాడి వెళ్లడం తప్ప ఆయన చేస్తున్నదేమి లేదు అన్న విమర్శలు వినవస్తున్నా స్పందించిన పవర్ స్టార్ చాలా సైలెంట్‌గా చేసిన పని భలే చిత్రంగా వుంది. ఒక విధంగా నోటితో కాకుండా చేతితో జవాబు చెప్పినట్లు అయింది. ఈ పనితో అటు చంద్రబాబుకు, ఇటు బీజేపీకి అంటే తాను నమ్ముకున్న మోడీకి కూడా  జాగ్రత్త అంటూ సంకేతాలు పంపించాడు.

హోదా ఇవ్వనని బీజేపీ, అది కావాలి కాని బీజేపీయే ఇవ్వడం లేదంటూ డొంకతిరుగుడు మాటలతో టీడీపీ కాలం గడిపేస్తూ ఏపీకి జరగాల్సిన నష్టాన్ని జరగనిస్తున్నారు.  ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకున్న తిరుపతికి చెందిన మునికోటి కుటుంబానికి రెండు లక్షల ఆర్థిక సహాయం అందించాడు. అది కూడా తాను మీడియా ముందుకు వచ్చి ఫోటోలకు ఫోజులిచ్చి, నాలుగు మాటలని చురకలంటించకుండా సైలెంట్‌గా చేశారు. తన అనుచరులతో మునికోటి కుటుంబానికి చెక్ పంపించాడు.

ఈ పని ద్వారా తాను ప్రత్యేక హోదా కావాలని కోరుకుంటున్నానన్న విషయాన్ని స్పష్టం చేశాడు. అంతే కాదు హోదా కోసం ఎవరు పోరాడినా వారికి బాసటగా ఉంటానన్న విషయాన్ని తేటతెల్లం చేశాడు. దీంతో పాటు చంద్రబాబునాయుడుకు మంచి ఝలక్ ఇచ్చాడు. మునికోటి ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆయన కుటుంబానికి చంద్రబాబు ప్రభుత్వం అయిదు లక్షల రూపాయిల పరిహారాన్ని ప్రకటించింది. ఏడాది దాటిపోయినా దాని అతీగతీ లేదు. బాబు పట్టించుకోవడం లేదు కాబట్టే తాను ఆదుకున్నానన్న సంకేతంతో పాటు బాబూ.. ఇది మీకు తగదు, అవసరం అయితే రంగంలోకి దిగగలను అన్న విషయం పవన్ కళ్యాణ్ ఇండైరక్ట్‌గా స్పష్టం చేశారు.

ఇంకో విశేషం కూడా ఉంది. జగన్ పత్రిక సాక్షిలో బాబుగారు మునికోటి గుర్తున్నాడా అన్న కథనానికి స్పందించి పవన్ కళ్యాణ్ ఈ పనిచేశాడు. ప్రస్తుతం వైకాపా హోదా కోసం 13పార్టీలను కలుపుకుని ఉద్యమబాట పట్టింది. అంతే కాదు ఒక అడుగు ముందుకేసి చంద్రబాబు పోరాటం చేసినా ఆయన వెనుకాల ఉంటామని తెలిపింది. కాంగ్రెస్ పార్లమెంట్ వేదికగా చేస్తున్న పోరాటానికి మద్దతు పలికింది. జగన్ అంటే వైకాపా తమకు హోదా విషయంలో రాజకీయ ప్రయోజనం కన్నా... ప్రజాప్రయోజనమే ముఖ్యం అన్న ధోరణి అవలంభిస్తోంది. ఈ తరుణంలో మౌనంగా ఉన్న పవన్ కళ్యాణ్ సాక్షి కథనానికి స్పందించడం ఇప్పుడు ఏపీలో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

Show comments