రామ్ చరణ్ వ్యాపారానికి.. ఏపీ గవర్నమెంటు ఊతం!

పీకల్లోతు నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రవాణా రంగ సంస్థ ఏపీఎస్ ఆర్టీసీ కష్టాల గురించి పట్టించుకోరు.. విమానయాన వ్యాపారం చేస్తున్న ప్రైవేట్ వ్యాపారుల కోసం మాత్రం కోట్ల రూపాయల రాయితీలు ఇస్తారు, వారి లాభాల కోసం కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి తీసి ఇస్తారు.

ఇది చంద్రన్న సర్కారు.. విమానాశ్రయాలు, విమానాలు.. సింగపూర్ కలలు తప్ప… ఆర్టీసీ బస్సులు, బస్టాండుల్లో పేరుకున్న మురికి పట్టదు. బాబు గారి హైటెక్ పాలనతో సగటు ప్రజలు విస్తుపోయే  అంశం మరోటి తెరమీదకు వచ్చింది. 

ఏపీలో ఏ మాత్రం ప్రయాణికుల ఫ్లోటింగ్ లేని విజయవాడ- తిరుపతి, విజయవాడ- కడప రూట్లలో విమానాలు నడుపుతున్న ట్రూ జెట్ విమానయాన సంస్థకు  రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధుల సహకారం అందిస్తోంది. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ గా ఉన్న ఈ సంస్థకు సర్దుబాటు నిధి పేరుతో.. ఏపీ ప్రభుత్వం ఐదు కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది. ఇప్పుడు మాత్రమే కాదు.. ప్రతి ఆరు నెలలకూ ఒకసారి ఈ మేరకు ఆ సంస్థకు నిధులు మంజూరు అయ్యే విధంగా జీవో కూడా ఇచ్చింది!

ఎందుకు? అంటే.. నష్టాలు ఉన్నా, ఆ రూట్లలో విమానాలు తిప్పుతున్నందుకు! భలే ఉంది కదా.. వాళ్లు ప్రైవేట్ వ్యక్తులు, బడా వ్యాపారులు.. డబ్బును ఏం చేసుకోవాలో తెలీక విమానయాన సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. మరి అంత త్యాగం చేస్తున్నారు కాబట్టి.. వాళ్లను ఆదుకోవడానికి ఏపీ ప్రభుత్వం ఈ విధంగా నిధులు మంజూరు చేసి ఉద్ధరిస్తోంది. ఏపీ జనాలు విమానాలు చూడలంటే.. ఈ విధంగా ప్రజల సొమ్మును ధారదత్తం చేయాలి కదా!  

ఇదీ చంద్రన్న మార్కు పాలన. విమానాలు తిరగాలి.. కాబట్టి ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు తీసి ప్రైవేట్ వ్యక్తులకు ధారపోయాలి. ఇందుకు ప్రతిగా ఆ సంస్థలు.. పెద్ద త్యాగమే చేస్తున్నాయని ప్రభుత్వం చెబుతోంది. ఆ త్యాగం ఏమనగా.. ఆ విమానాల్లో కొన్ని పరిమిత సీట్లలో ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చట! బంపర్ ఆఫర్ కదూ! 

మరి వ్యాపారం ముసుగులో ప్రజల సొమ్మును దోచుకునే ఐడియా ఆ విమానయాన సంస్థకే వచ్చిందో.. దోచి పెట్టడంలో తప్పులేదని చంద్రన్న ప్రభుత్వమే భావిస్తోందో కానీ.. దోపిడీ అయితే నిర్లజ్జ గా సాగుతోంది.  

Show comments