కమల్‌హాసన్‌ ప్రశ్నిస్తూనే వుంటాడట.!

సినీ నటుడు, కమల్‌హాసన్‌కి పెద్ద చిక్కే వచ్చిపడింది. 'చేతనైతే ఉప ఎన్నికల్లో పోటీ చేసి, మా మీద గెలిచి చూపించు..' అంటూ అధికార అన్నాడీఎంకే పార్టీ సవాల్‌ విసిరింది మరి. ‘చేతనైతే..‘ అన్న మాట అతనికి గట్టిగానే తగిలేసింది. గత కొంతకాలంగా అన్నాడీఎంకే పార్టీలోని శశికళ వర్గానికి వ్యతిరేకంగా కమల్‌హాసన్‌ 'పోరాటం చేస్తోన్న విషయం విదితమే. సోషల్‌ మీడియాలో కామెంట్లేస్తున్నాడు, పత్రికలకెక్కుతున్నాడు, టెలివిజన్‌ షోలలో కనిపిస్తున్నాడు.. 

'త్వరలోనే మధ్యంతర ఎన్నికలు వస్తాయ్‌..' అంటూ కమల్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలు అన్నాడీఎంకేలో శశికళ వర్గానికి ఆగ్రహం తెప్పించాయి. అంతే, 'నువ్వు అలా కలలు కంటూనే వుండు.. సినిమాటిక్‌ మాటలు మానేసి, చేతనైతే రాజకీయాల్లోకి రా..' అంటూ సవాల్‌ విసిరేశారు ఆ పార్టీ నేతలు. ఈ విమర్శలపై కాస్త కంగారు పడినా, తేరుకుని స్పందించాడు. 'నేను రాజకీయాల్లోకి రావాలనుకోవడంలేదు.. ప్రజల తరఫున మాత్రం ప్రశ్నిస్తూనే వుంటాను..' అని క్లారిటీ ఇచ్చాడాయన. ఎవరో రెచ్చగొట్టారని, ఎన్నికల్లో పోటీ చేస్తే ఏమవుతుందో  అతనికి బాగా తెలుసు మరి.

''నా నుంచి అన్నాడీఎంకే ప్రభుత్వం చికాకులు ఎదుర్కోక తప్పదు. నేను చెప్పే మాటలు తప్పయితే వాటిని ఎవరూ విశ్వసించరు. ఎవరూ విశ్వసించని విధంగా నేను మాట్లాడను. చేతనైతే రాజకీయాల్లోకి రా, పోటీ చెయ్‌.. అనే మాటలు అర్థ రహితం.. ప్రశ్నించేవారినిలా ఎదురుప్రశ్నించి తప్పించుకుంటారా?'' అంటూ కమల్‌ మరోసారి అన్నాడీఎంకే పార్టీపై మండిపడ్డారు. 

అభిమానులతో ఈ మధ్య తరచూ భేటీ అవుతున్న కమల్‌, ప్రస్తుతానికి రాజకీయాలపై అవగాహన పెంచుకుంటున్నాడట. ఏమో, 2019 ఎన్నికల నాటికి ఆయన ఆలోచనలు ఎలాగైనా మారొచ్చు. ఈలోగా ప్రశ్నిస్తూ వుంటాడన్నమాట.

Show comments