పవన్‌కళ్యాణ్‌.. ఈ ప్రశ్నలకు బదులేది.?

ఎన్నాళ్ళకెన్నాళ్ళకు.? పార్టీ పెట్టిన రెండేళ్ళకు జనసేన పార్టీ తొలి బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభ ద్వారా ప్రజల్ని ఉద్దేశించి జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ ప్రసంగించనున్నారు. మామూలుగా బహిరంగ సభ అంటే, ఆ వేదికపై తక్కువలో తక్కువ పది మంది అయినా కనిపిస్తుంటారు. కానీ, ఇక్కడ బహిరంగ సభ వేదికపై మాట్లాడేది పవన్‌కళ్యాణ్‌ ఒక్కరేనట. అవును మరి, జనసేనాని ఆయనొక్కడే కదా.! 

సరే, ఆయనగారి పార్టీ.. ఆయనగారి ఇష్టం. ఖాళీ వుంటే పొలిటికల్‌ డైలాగులు చెప్తారు.. లేదంటే సినిమాల్లో నటిస్తారు.. వీలు కుదిరితే ఫామ్‌హౌస్‌లో తన పనేదో తాను చేసుకుంటారు.. అనుకోవడానికి వీల్లేదిక్కడ. ఒక్కసారి ప్రజా జీవితంలోకి వస్తే, తప్పదు.. ప్రజలు ప్రశ్నిస్తారు. కానీ, ఆ ప్రశ్నలకు పవన్‌ సమాధానమిస్తాడా.? ఇవ్వడుగాక ఇవ్వడు. తాను మాత్రం ప్రశ్నిస్తానంటాడు. 

కాస్సేపట్లో ప్రారంభమయ్యే పవన్‌కళ్యాణ్‌ సభలో.. సారీ సారీ జనసేనాధిపతి పవన్‌కళ్యాణ్‌ సభలో ఆయన ఏం మాట్లాడతారు.? ఇదే ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఆయన ముందు చాలా ప్రశ్నలున్నాయి. వాటికీ ఈ సభ ద్వారా సమాధానం దొరుకుతుందా.? అసలు ఏమేం ప్రశ్నలు ఆయన ముందున్నాయో చూద్దాం.! 

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా విషయంలో జనసేన స్టాండ్‌ ఏంటి.? తిరుపతి వేదికగా ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చిన నరేంద్రమోడీని నిలదీయడానికి జనసేన పార్టీ, పవన్‌కళ్యాణ్‌ సుముఖంగా వున్నట్టా.? లేనట్టా.?  Readmore!

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి విషయంలో రైతులు ఇంకా గగ్గోలు పెడుతూనే వున్నారు. వారికి అండగా నిలుస్తానని గతంలో చెప్పిన పవన్‌, ఇప్పుడు వారి సమస్యలపై స్పందిస్తారా.? లేదా.? 

ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఫిరాయింపులపై పవన్‌కళ్యాణ్‌ స్పందిస్తారా.? స్పందించరా.? 

ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా జనసేన పార్టీ, టీడీపీ - బీజేపీలతో అంటకాగుతూనే వుంటుందా.? 

అన్నిటికీ మించి, ఈ సమావేశం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలకే పరిమితమా.? తెలంగాణ గురించి కూడా ఇక్కడ ఏమైనా ప్రస్తావన వస్తుందా.? 

అభిమానం వెర్రితలలు వేయడంతో ఓ అభిమాని ప్రాణాలు కోల్పోయిన ఘటన నేపథ్యంలో పవన్‌కళ్యాణ్‌, అభిమానుల్ని ఉద్దేశించి ఇవ్వబోయే మెసేజ్‌ ఎలా వుంటుంది.? 

ఆర్థిక లోటు సహా, ఆంధ్రప్రదేశ్‌ ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కేంద్రాన్ని పవన్‌కళ్యాణ్‌ ప్రశ్నిస్తారా.? లేదా.? 

ఇవీ ప్రశ్నలు. మరి, వీటికి పవన్‌కళ్యాణ్‌ నుంచి సమాధానం వస్తుందో లేదోగానీ, షరామామూలుగానే ఆయన, తానేం మాట్లాడుతున్నాడో తనకే తెలియని రీతిలో ఏదేదో మాట్లాడేసి, 'జైహింద్‌' అనేసి వెళ్ళిపోకుండా వుంటే పరిస్థితేంటట.!

Show comments