మెగాస్టార్ చిరంజీవికి భారతీయ జనతా పార్టీ గాలమేస్తోందట. ఆ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు, ఈ మధ్యనే చిరంజీవితో 'రహస్యంగా' భేటీ అయ్యారనే ప్రచారమూ జరుగుతోంది. తమ్ముడు పవన్‌కళ్యాణ్‌ని 2014 ఎన్నికల్లో ఫుల్లుగా వాడేసుకున్న బీజేపీ, ఇప్పుడు అన్నయ్య చిరంజీవి మీద ఫోకస్ పెట్టడం కాస్తంత ఆసక్తికరమైన విషయమే.
బీజేపీ - టీడీపీలకు 2014 ఎన్నికల్లో మద్దతిచ్చిన 'జనసేన అధినేత' పవన్‌కళ్యాణ్, ఇప్పుడు తన రాజకీయ పార్టీని జనంలోకి తీసుకెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తమను కూడా కలుపుకుపోతే బావుండేదని బీజేపీలో, పవన్‌కళ్యాణ్ 'ప్రో' వర్గం భావిస్తోంది. కానీ, పవన్‌కళ్యాణ్‌కి చంద్రబాబు అంటే అదో ఇది. ఇక్కడే బీజేపీకీ - పవన్‌కళ్యాణ్‌కీ మధ్య వ్యవహారం తేడా కొట్టేస్తోంది. ఈ పరిస్థితుల్లో పవన్‌కళ్యాణ్ కంటే చిరంజీవి బెటర్.. అన్న ఆలోచన బీజేపీ అధిష్టానానికి వచ్చిందట.
ప్రస్తుతం చిరంజీవి, కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. పవన్‌కళ్యాణ్ కంటే ముందే చిరంజీవికి, బీజేపీ గాలం వేసినా.. అప్పట్లో చిరంజీవి, బీజేపీ పట్ల అంత సానుకూలంగా స్పందించలేదు. అయితే, ఈ మధ్యకాలంలో చిరంజీవి నుంచీ బీజేపీ వైపుగా 'సానుకూల పవనాలు' వీస్తున్నాయట. దాంతో, ఇద్దరి మధ్యా చర్చలకు ఆస్కారమేర్పడిందన్నది రాజకీయ వర్గాల్లో బలంగా విన్పిస్తోన్న వాదన.
మరోపక్క, పవన్‌కళ్యాణ్ పూర్తిగా బీజేపీకి దూరమైపోలేదనీ, పవన్‌కళ్యాణ్‌తోపాటు చిరంజీవి కూడా ముందు ముందు బీజేపీ వైపు వస్తారనే నమ్మకం తమకుందని బీజేపీలో ఒకరిద్దరు నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వారిలో పవన్‌కళ్యాణ్‌కి అత్యంత సన్నిహితుడైన సోము వీర్రాజు కూడా ఒకరు.
రాజకీయాల్లో ఎప్పుడెలా సమీకరణాలు మారతాయో ఊహించడం కష్టం. అన్నదమ్ములిద్దరూ కలిసి బీజేపీ వైపు అడుగులేస్తారో, అన్నయ్య మాత్రమే బీజేపీ వైపు చూస్తారో, అన్నయ్య ససేమిరా అనడం - తమ్ముడు బీజేపీతో మళ్ళీ 'ప్యాచప్' అవడం జరుగుతుందో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.