జగమంత కుటుంబం.. కానీ, చివరికి ఏకాకి

'అమ్మ'.. తమిళనాడు రాజకీయాల్లో బహుశా ఇంకెవరికీ ఈ ఘనత దక్కదేమో. అది ఓ పదం మాత్రమే కాదు, అది ఓ గౌరవం. ఆ గౌరవాన్ని తమిళ ప్రజలు రాజకీయాల్లో ఇంకెవరికీ ఇవ్వబోరు. రాజకీయ వివాదాలు, ఆరోపణలు ఎలా వున్నా, జయలలిత డైనమిక్‌ లీడర్‌. పేదల పాలిట ప్రత్యక్ష దైవం. 'అమ్మ' పేరుతో క్యాంటీన్లను నిర్వహించడమే కాకుండా, అనేక సంక్షేమ పథకాల్ని పేదల కోసం జయలలిత అమలు చేయడమే అందుకు నిదర్శనం. 

జయలలితకూ కుటుంబం వుంది. కానీ, ఆమె పెళ్ళి చేసుకోలేదు. అసలు జయలలిత తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు ఏరీ ఎక్కడ.? ఈ ప్రశ్న అందరి మెదళ్ళలోనూ మెదిలింది. జయలలిత మేనకోడలు మాత్రమే ప్రస్తుతం కనిపించారు. అంతకుమించి, ఆమె కుటుంబ సభ్యులెవరూ కన్పించలేదు. నిజానికి, ఆమె రాజకీయాల్లో వున్నన్నాళ్ళూ ఆమె తన కుటుంబ సభ్యుల్ని దగ్గరికి రానివ్వలేదని అంటారు. అదెంత నిజం.? అన్నది వేరే విషయం. 

లక్షలాదిమంది జయలలితను ఆఖరి చూపు చూసేందుకు వచ్చారు. తమిళనాడులోని ప్రముఖ బీచ్‌ అయిన చెన్నయ్‌లోని మెరీనా బీచ్‌, జన సంద్రాన్ని తలపించింది. ఇసకేస్తే రాలనంత జనం కన్పించారు. దేశ రాజకీయాల్లోనే చాలా అరుదుగా మాత్రమే కన్పించే సందర్భమిది. అమ్మ జయలలిత అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారని తెలియగానే, తమిళనాడులో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అమ్మ ఆరోగ్యం బాగుపడాలని కోరుకుంటూ కొందరైతే బలవన్మరణాలకు పాల్పడ్డారు. 

ఇంతలా జనాభిమానాన్ని చూరగొన్న జయలలితకు, చివరికి ఆమె స్నేహితురాలు శశికళ మాత్రమే అంత్యక్రియలు నిర్వహించడం గమనార్హం. జయలలిత, తన కుటుంబ సభ్యుల్ని దూరం పెట్టి వుండొచ్చుగాక. కానీ, ప్రాణం పోయాక కూడా ఆమె కుటుంబ సభ్యులు ఆమె అంత్యక్రియల్లో పాల్గొనకపోవడం ఆశ్చర్యకరం. జయలలిత పేరుతో అనేక ఆస్తులున్నాయి. వాటినిప్పుడు ఏం చేస్తారు.? ఆ ఆస్తుల కోసమైనా కుటుంబ సభ్యులు వస్తారా.? ఏమో మరి, వేచి చూడాల్సిందే. 

ఒక్కటి మాత్రం నిజం కుటుంబ సంబంధాల పరంగా జయలలిత చివరి రోజుల్లో ఏకాకి అయ్యారేమో, రాజకీయాలకతీతంగా దేశమంతా ఆమె మరణాన్ని తట్టుకోలేకపోయింది. ఓ వ్యక్తి, తన జీవితంలో ఇంతకన్నా ఏం సాధించగలరు.!

Show comments