అభిమాని మరణం పవన్‌ని కదిలించింది

తన అభిమాని హత్యకు గురికావడంపై పవన్‌కళ్యాణ్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవానికి ఈ ఘటన మూడు రోజుల క్రితమే జరిగింది. కర్నాటకలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న వినోద్‌ అనే పవన్‌కళ్యాణ్‌ అభిమాని, మరో హీరో అభిమాని చేతుల్లో హత్యకు గురయ్యాడు. వాస్తవానికి ఆ కార్యక్రమం అవయవదానంపై అవగాహన కోసం ఏర్పాటు చేసింది. సినీ నటుడు సుమన్‌ ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. 

కార్యక్రమం ముగిశాక వినోద్‌ తిరిగి వచ్చేస్తుండగా, అప్పటికే వినోద్‌తో గొడవపడ్డ మరో హీరో అభిమానులు, అతన్ని దారుణంగా కొట్టారు, కత్తులతో అతనిపై దాడిచేశారు. ఈ క్రమంలోనే వినోద్‌ తీవ్రంగా గాయపడ్డాడు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. దాడి చేసింది జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులనే ప్రచారం జరుగుతోంది. 

ఈ వ్యవహారం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న పవన్‌కళ్యాణ్‌, తిరుపతికి వెళ్ళి మృతి చెందిన అభిమాని కుటుంబాన్ని పరామర్శించేందుకు సమాయత్తమయ్యారు. ఇంకోపక్క, నేడు వినోద్‌ అంత్యక్రియలు తిరుపతిలో జరిగాయి. వినోద్‌ అంత్యక్రియల్లో పెద్దయెత్తున పవన్‌కళ్యాణ్‌ అభిమానులు పాల్గొన్నారు. మరోపక్క, విశాఖలో పవన్‌కళ్యాణ్‌ అభిమానులు ఆందోళనకు దిగారు. ఘటనపై విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అయితే, వినోద్‌పై దాడి చేసిన అక్షయ్‌కుమార్‌ అనే వ్యక్తిని ఇప్పటికే కర్నాటక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

అభిమానులు హద్దు మీరితే పరిస్థితులు ఇలానే తగలడతాయి. హీరోల మధ్య ఎలాంటి విభేదాలూ వుండవు. ఒకవేళ వున్నాసరే, అంతా కలిసిమెలిసే వుంటారు. 'మేమంతా ఒక్కటే..' అని చెబుతుంటారు. అభిమానులకే అభిమానం హద్దులు దాటేసి, అది కాస్తా పిచ్చిగా మారిపోయి, ఆ పిచ్చి కూడా పీక్స్‌కి వెళ్ళిపోతుంది. అభిమాని వినోద్‌ మరణం, మొత్తం అభిమాన లోకానికే గుణపాఠం కావాలి. ఏ హీరో అభిమాని.. అన్నది కాదిక్కడ విషయం. దాదాపు అందరు హీరోల అభిమానుల్లోనూ 'అతిగాళ్ళు' వుంటారు.. ఆ అతిగాళ్ళతోనే ఆయా హీరోలకూ ఇబ్బందుల వచ్చిపడ్తున్నాయి.  Readmore!

ఓ నిండు ప్రాణం.. ఇలా అభిమానం పేరుతో బలైపోవడం అత్యంత బాధాకరమైన విషయం. అభిమానుల్ని ఉద్దేశించి పవన్‌కళ్యాణ్‌ రేపు ఎలాంటి మెసేజ్‌ ఇస్తాడోగానీ, మొత్తంగా హీరోలంతా తమ అభిమానుల్ని ఇలాంటి ఘటనలపై అప్రమత్తం చేయాలి.

Show comments

Related Stories :