400 కోట్లు.. అంతకు మించి.!

రజనీకాంత్‌ పేరు చెబితే చాలు, బాక్సాఫీస్‌ వద్ద కనక వర్షం కురిసేస్తుంది.. అన్నది వెనకటి మాట. రజనీకాంత్‌ సినిమా వస్తోందంటే అంచనాలు సినిమా సినిమాకీ పెరుగుతున్నా, అంచనాలు అందుకోలేక చతికిలపడ్డమంటూ జరిగితే, ఏకంగా నిర్మాతలు రోడ్డునడిపోతున్నారు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కోర్టులకెక్కుతున్నారు. అయినా, రజనీకాంత్‌ సినిమాలపై హైప్‌ ఏమాత్రం తగ్గకపోవడం విశేషమే మరి. 

ఇక, రజనీకాంత్‌ తాజా చిత్రం '2.0' కోసం 400 కోట్లు ఖర్చు చేస్తున్నారట. లైకా ప్రొడక్షన్‌ ఈ విషయాన్ని ధృవీకరించేసింది కూడా. ఇందులో 300 కోట్లు పైన సినిమా నిర్మాణం కోసం, దాదాపు 50 కోట్లు ప్రమోషన్‌ ఖర్చు చేస్తారన్నది తాజా ఖబర్‌. రజనీకాంత్‌ పారితోషికమే చాలా ఎక్కువనుకోండి.. అది వేరే విషయం. ఆర్టిస్టుల రెమ్యునరేషన్‌ కలుపుకుంటే 100 కోట్లను టచ్‌ చేస్తోందన్న ప్రచారమూ జరుగుతోంది. 

దేశవ్యాప్తగా రజనీకాంత్‌కి వున్న క్రేజ్‌, విదేశాల్లోనూ సినిమాకి లభిస్తోన్న క్రేజ్‌.. ఇదంతా లెక్కేసుకుని, నిర్మాతలు ఖర్చు విషయంలో ఎక్కడా రాజీపడలేదు. మరోపక్క శంకర్‌ అంటేనే భారీతనం. పైగా 'రోబో' సీక్వెల్‌. టెక్నికల్‌గా అత్యున్నత స్థాయిలో వుండాలి కదా.! 'కబాలి' కోసం 150 కోట్లు ఖర్చు చేశారన్న ప్రచారం జరిగింది. ఆ ఖర్చు సినిమాలో కన్పించలేదాయె. అంతకు ముందు 'లింగా' పరిస్థితీ అంతే. 'విక్రమసింహ' (కొచాడియాన్‌) పరిస్థితీ ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. 

అసలే దేశమంతటా కరెన్సీ సంక్షోభం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో '2.0' సినిమా ఖర్చు 400 కోట్లు అంతకు మించి.. అని జరుగుతున్న ప్రచారం ఒకింత ఆసక్తికరమే. ఈ కరెన్సీ సంక్షోభం ఎక్కువ కాలం వుండకపోవచ్చు. ఈలోగా ఎటూ సినిమా థియేటర్లలోకి రాదు. సో, అప్పటికల్లా పరిస్థితులు సద్దుమణిగా తలైవా సంచలన విజయాన్ని '2.0'తో నమోదు చేస్తాడని రజనీకాంత్‌ అభిమానులు అంటున్నారు. Readmore!

Show comments