టీడీపీ, బీజేపీ బస్తీ మే సవాల్‌.!

తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ మళ్ళీ కామెడీ మొదలు పెట్టాయి. చంద్రబాబు డైరెక్షన్‌లో టీడీపీ నేతలు, నరేంద్రమోడీ డైరెక్షన్‌లో ఏపీ బీజేపీ నేతలు ఈ కామెడీ షోని రక్తి కట్టించేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలు కాపాడలేకపోతున్న ఏపీ బీజేపీ నేతలు తమ పదవులకు రాజీనామా చేయాలంటూ టీడీపీ రాజ్యసభ సభ్యులు చేసిన డిమాండ్‌పై, ఏపీ బీజేపీ సీరియస్‌గా స్పందించేసింది. 

'ముందు మీ పార్టీలో చేరిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చెయ్యించండి.. అలా చేయగలిగితే, మేం రాజీనామా చేసి ఎన్నికలకు వెళతాం.. అప్పుడు మీ వైపు ఎంతమంది ప్రజలు మొగ్గు చూపుతారో, మా వైపు ఎంతమంది మొగ్గు చూపుతారో తెలుస్తుంది..' అంటూ ఏపీ బీజేపీ నేత, ఆ పార్టీ ఎమ్మెల్యే అకుల సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీకి సవాల్‌ విసిరారు. ఇంతకన్నా కామెడీ ఇంకేమన్నా వుంటుందా.? 

''ప్రత్యేక హోదా ఇవ్వలేం.. ఆంధ్రప్రదేశ్‌ని ప్రత్యేక దృష్టితో కూడా చూడలేం.. ఎందుకంటే, దేశంలో అన్ని రాష్ట్రాలూ మాకు సమానం. ఒక రాష్ట్రానికి ఎక్కువ, ఒక రాష్ట్రానికి తక్కువ చెయ్యలేం కదా.. అందుకు రాజ్యాంగం ఒప్పుకోదు..'' అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, రాజ్యసభ సాక్షిగా స్పష్టం చేశారు. అది నిజమే, ఒక రాష్ట్రానికి ఎక్కువ, ఒక రాష్ట్రానికి తక్కువ చేయకూడదు. కానీ, తాము కోరుకోని విభజనను ఆంధ్రప్రదేశ్‌ నెత్తిన రుద్దింది ఎవరు.? దేశంలో ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే క్రమంలో ఇంకో రాష్ట్రాన్ని సర్వనాశనం చెయ్యాలని రాజ్యాంగం చెబుతోందా.? ఇక్కడ, బలవంతపు వేర్పాటుకు గురయ్యింది ఆంధ్రప్రదేశ్‌. అదీ కేంద్రం తీసుకున్న పాశవిక చర్య కారణంగా. ఇది వాస్తవం. 

వాస్తవాలతో పనిలేదిక్కడ. విభజనకు అన్ని రాజకీయ పార్టీలూ సహకరించాయి. ఇప్పుడు అవే రాజకీయ పార్టీలు విభజన తీరుపై తలో రకంగా మాట్లాడుతున్నాయి. దాని గురించి ఇప్పుడు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.  Readmore!

బీజేపీ - టీడీపీ గొడవ విషయానికొస్తే, ఇదేమీ ఇప్పుడు కొత్తగా తెరపైకొచ్చింది కాదు. చాలాకాలంగా జరుగుతున్న తంతు మాత్రమే. చంద్రబాబు, బీజేపీపై విరుచుకుపడ్తారు.. బీజేపీ, చంద్రబాబుపై విరుచుకుపడ్తుంది. టీడీపీ - బీజేపీ నేతలు బాహాబాహీకి తలపడ్తారు. చివరికి మళ్ళీ అంతా ఒక్కటే. టీడీపీతో తెగతెంపులు చేసుకుంటామని బీజేపీ అనదు. బీజేపీతో తెగిపోయిందని చంద్రబాబూ చెప్పరు. మధ్యలో జనమే వెర్రి వెంగళప్పలు.. అన్నది ఆ రెండు పార్టీల భావన.

Show comments

Related Stories :