నిన్న సిస్కో అయిపోయింది.. రేపు హెచ్ పీ, మరునాడు ఐబీఎమ్ కార్ప్, ఆ తర్వాత ఆర్కెల్ కార్ప్.. ప్రధానంగా హార్డ్ వేర్ పరిశ్రమలోని ధిగ్గజ కంపెనీలు ఉద్యోగాల కోతకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు ఈ పరిశ్రమ విశ్లేషకులు, పండితులు. అమెరికన్ బేస్డ్ కంపెనీ సిస్కో పద్నాలుగు వేల మంది ఉద్యోగులపై వేటుకు రంగం సిద్ధం చేసిందని మొదట వార్తలు వచ్చినా చివరకు 5,500 మంది మీద వేటు పడింది. కానీ ఇదేమీ తక్కువ శాతం కాదు. ఆ కంపెనీకి ఉన్న ఉద్యోగుల్లో ఏడు శాతానికి సమానం అంటే పరిస్థితిని సులభంగా అర్థం చేసుకోవచ్చు.
ఈ రంగంలో ఇలా భారీగా ఉద్యోగులను ఇంటికి పంపడం ఆది కాదు అంతం కాదు. ఈ ఏడాదిలో డెల్ ఐఎన్సీ పదివేల మందిని, ఇంటెల్ పన్నెండువేల మంది ఉద్యోగులను ఇంటికి పంపాయి. ఈ సంవత్సరంలో ఇప్పటికే ఓవరాల్ గా అమెరికాలో చిన్నా పెద్ద కంపెనీలు కలిసి 68 వేల మంది ఉద్యోగులను షెడ్ కు పంపినట్టుగా చెబుతున్నాయి విశ్లేషకులు గణాంకాలు.
ప్రధానంగా హార్డ్ వేర్ పరిశ్రమలోనే ఇలాంటి కోత కనిపిస్తోందని దీనికి పలు కారణాలున్నాయని వారు అంటున్నారు. అందులో ప్రధానమైనది మారుతున్న సాంకేతికతో ఈ పరిశ్రమలో మనుషుల అవసరం తగ్గుతోందని.. హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్, నెట్ వర్క్స్, డాటా బేస్ మేనేజ్ మెంట్ విషయంలో అందుబాటులోకి వచ్చిన సాంకేతికత పుణ్యమా అని మనుషుల అవసరం తగ్గిపోతోందని.. దీంతో ఉద్యోగుల సంఖ్య ను తగ్గించుకుంటున్నాయని వీరు చెబుతున్నారు.
అలాగే ఈ హార్డ్ వేర్ కంపెనీలు ఈ రంగంలో పెట్టుబడులను చాలించుకొంటూ ఉండటం కూడా ఉద్యోగాల కోతకు ఒక కారణమని విశ్లేషిస్తున్నారు. సిస్కో నే ఉదాహరణగా తీసుకుంటే.. తమ హార్డ్ విభాగంలో ఇలా కాస్ట్ కటింగ్ లో భాగంగా ఉద్యోగులను తగ్గించుకొంటూ వచ్చి.. సాఫ్ట్ వేర్ పరిశ్రమలో పెట్టుబడుల స్థాయిని పెంచుతోందని.. హార్డ్ వేర్ తో పోల్చుకుంటే.. సాఫ్ట్ వేర్ లో లాభాలు ఎక్కువగా ఉండటంతో కంపెనీల ఇలా వ్యవహరిస్తున్నాయని చెబుతున్నారు.
ఏతావాతా .. కంప్యూటర్లు, చిప్ లు, రౌటర్లు, సర్వర్లు.. ఈ తరహా హార్డ్ వేర్ తయారీ పరిశ్రమలో రానున్నది గడ్డుకాలమే అని ఈ రంగంపై ఆసక్తితో హార్డ్ వేర్ డిజైనింగ్ ను అభ్యసించే వాళ్లకు ఇది చేదు గుళికే అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.