బిలేటెడ్ విషెస్ : మోడీ పుట్టినరోజు కవిత

మోడీ జీ మీకు వందనం

మీ జన్మదినం ఈ జాతికి పర్వదినం.
అందరమూ కలిసి పండగ చేసుకున్నాం.
అభినందన చందనం అర్పించుకుంటున్నాం.

మోడీజీ... అమరావతికి కొబ్బరికాయ కొట్టిన రోజున
మీరు తెచ్చిన గుప్పెడు పుట్ట మట్టి మామూల్ది కాదు.
మీ చేతిలో పడి మంత్రపూరితమూ అయింది.
ఒక్కొక్క మట్టి రేణువూ.. ఒక్కొక్క విత్తుగా మారి...
అమరావతి ఏం ఖర్మ.. ఆంధ్రదేశం అంతటా కూడా..
భారీ ‘‘భయ వ్రుక్షాలు’’ మొలిచాయి...
అందుకే అభినందన చందనం అర్పిస్తున్నాం.

మీరు తెచ్చి చిలకరించిన చెంబుడు గంగ
శివ జటాజూట పాయగా ఉరికిన ప్రళయంగా..
భవిష్యత్తు గురించిన భయవిహ్వల తరంగంగా
మా రాష్ట్రాన్ని మొత్తం అభిషేకించేస్తూనే ఉంది.
అందుకే అందరమూ పండగ చేసుకుంటున్నాం.

ప్రత్యేకహోదా అనే బ్రహ్మపదార్థం
మాకు ఈ జన్మకు భగవత్ ప్రసాదం అనుకున్నాం.
ప్రసాదాన్ని తన్నుకుపోయే గద్దలుంటాయని..
భగవదేచ్ఛనైనా దారి మళ్లించగల ధూర్తులుంటారని...
మాటమాత్రంగానైనా ఎరుకలేని మూర్ఖులం
అందుకే మీ జన్మదినం ఈ జాతికి పర్వదినం

ఇంతోటి మూర్ఖత్వానికి ఇంతకంటె పండగలేం ఉంటాయి
నిశీధి కప్పేసిన నిత్య ఆర్తికి కొత్త వెలుగులు ఎలా వస్తాయి?
మా అవిటితనాన్ని మరపించే శస్త్రచికిత్సలు ఉంటాయనుకున్నాం
తమ దయారాధితమైన చంకలో కర్రలే ప్రాప్తం అని తెలుసుకున్నాం

మోడీ జీ మీకు వందనం
మీ జన్మదినం ఈ జాతికి పర్వదినం.
అందరమూ కలిసి పండగ చేసుకుంటున్నాం.
అభినందన చందనం అర్పించుకుంటున్నాం.

-    కపిలముని

kapilamuni.a@gmail.com

Show comments