అద్భుతహ: అప్పుడు అవినీతి.. ఇప్పుడంతా నీతి.!

కాలగమనంలో ఓడలు బళ్ళవడం.. బళ్ళు ఓడలవడం జరుగుతాయో లేవోగానీ, నిన్న అవినీతిపరుడు.. నేడు నీతిమంతుడు అయిపోతాడు ఇప్పుడున్న రోజుల్లో. సాక్ష్యం కావాలా.. ఇదిగో, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పే అందుకు నిదర్శనం. కర్నాటక పేరు చెప్పగానే మైనింగ్‌ మాఫియా గుర్తుకొస్తుంది. ఆ మైనింగ్‌ మాఫియాకి ముఖ్యమంత్రి హోదాలో సహకరించారనే అభియోగాలు యడ్యూరప్పపై గతంలో నమోదయ్యాయి. సుమారు 45 కోట్ల రూపాయల లంచం మెక్కారంటూ యడ్యూరప్పపై ఆరోపణలు రావడం తెల్సిన విషయాలే. అప్పట్లో యడ్యూరప్ప ఆ కేసులో దోషిగా తేలారు. ఇప్పుడాయనకు సీబీఐ కోర్టు క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. 

ఇట్‌ హ్యాపెన్స్‌ ఓన్లీ ఇన్‌ ఇండియా. ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో యడ్యూరప్ప ఎదుర్కొనన్ని విమర్శలు, వివాదాలు బహుశా కర్నాటక రాజకీయాల్లోనే ఇంకెవరూ ఎదుర్కొని వుండరేమో. ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలు పార్టీకి దూరమవడం, వారిని బుజ్జగించుకుని తనవైపుకు తిప్పుకోవడం.. ఇదే తంతు నడిచింది. ఈ క్రమంలో వందల కోట్లు చేతులు మారినట్లు అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇలా, కర్నాటకలో రాజకీయ సంక్షోభాలే అక్కడ, అవినీతి రాజ్యమేలడానికి కారణమని దేశమంతా కోడై కూసింది. 

అవినీతి ఆరోపణల నేపథ్యంలో యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవికి దూరమవడం, ఆయన బీజేపీకి సైతం రాజీనామా చేయడం, తిరిగి బీజేపీలో చేరడం తెల్సిన విషయాలే. అలా బీజేపీలోకి రావడంతోనే బహుశా, ఇప్పుడాయనకు క్లీన్‌ చిట్‌ వచ్చిందన్నది సర్వత్రా విన్పిస్తోన్న అభిప్రాయం. అంతా మాయ.. ఇది రాజకీయ మాయ. ఎనీ డౌట్స్‌.?

Show comments