అబ్జర్వేషన్‌: ఆన్‌లైన్‌ 'క్యాన్సర్‌' ఓకేనా.?

పైరసీకీ క్యాన్సర్‌కీ పెద్దగా తేడా లేదు. ఎందుకంటే, పైరసీకి మందు లేదు.. క్యాన్సర్‌కీ మందు (నివారించేందుకు) లేదు. కాస్తో కూస్తో క్యాన్సరే నయ్యం.. కొన్ని క్యాన్సర్లను నివారించేందుకు వ్యాక్సిన్లు వున్నాయి. 

సినిమా రంగాన్ని పైరసీ క్యాన్సర్‌లా పట్టి పీడించేస్తోంది. 'అత్తారింటికి దారేది' సినిమా పైరసీ గుర్తుంది కదా.? తెలుగు సినీ పరిశ్రమ ఎప్పటికీ మర్చిపోలేదు ఈ సినిమా పైరసీ వివాదాన్ని. సినిమాలో సూపర్‌ హిట్‌ కంటెంట్‌ వుండబట్టి సరిపోయిందిగానీ, లేదంటే.. నిర్మాతకి ఆత్మహత్య ఒక్కటే మార్గం. అంతలా ఆ సినిమాని పైరసీ పట్టి పీడించింది. 

ఇప్పుడిదంతా ఎందుకంటారా.? బొంబాయి హైకోర్టు పైరసీ విషయమై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఆన్‌లైన్‌లో సినిమాని వీక్షించడం తప్పు కాదన్నది ముంబై హైకోర్టు తేల్చిన విషయం. సినిమాని ఆన్‌లైన్‌లో చూడటం తప్పు కాదు, దాన్ని ఎగ్జిబిట్‌ చేయడం, కాపీ చేయడం నేరమేనని స్పష్టం చేసింది హైకోర్టు. న్యాయస్థానాలిచ్చే తీర్పుల్ని తప్పు పట్టకూడదు. కానీ, ఈ విషయంలో మాత్రం, చాలా ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. 

పైరసీ అనేది ఏ రూపంలో వున్నా అది క్యాన్సరే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. సీడీల్లోకి పైరసీ చేయడం, ఆన్‌లైన్‌లో పైరసీ చేయడం.. దేనికదే. ఒకదాన్ని మించి ఇంకోటి నిర్మాతని ముంచేస్తాయి. అయినా, ఇప్పుడు సీడీలదాకా ఎవరు వెళుతున్నారు.? ఎంచక్కా, ఇంటర్నెట్‌లో సినిమా దొరికేసరికి డౌన్‌లోడ్‌ చేసి పారేస్తున్నారు. సోషల్‌ మీడియా పుణ్యమా అని లింకులు షేరింగులయిపోతున్నాయి. 

ఈ మధ్యనే చాలా పైరసీ వెబ్‌సైట్లు అంతర్జాతీయ స్థాయిలో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాయి. మన దేశంలో అయితే అలాంటి చాలా వెబ్‌సైట్లపై నిషేధం వుంది. 'ఇందులో కంటెంట్‌ని చూసేందుకు ప్రయత్నించినా, డౌన్‌లోడ్‌ చేసేందుకు ప్రయత్నించినా కఠినమైన శిక్షలు తప్పవు..' అనే హెచ్చరికలు ఆ వెబ్‌సైట్లను ఓపెన్‌ చేస్తే చాలు, సైట్‌ ఓపెన్‌ అవకుండానే దర్శనమిస్తున్నాయి. సరిగ్గా ఈ టైమ్‌లో, ఆన్‌లైన్‌లో పైరసీ సినిమాల్ని చూడటం తప్పు కాదని బాంబే హైకోర్టు తేల్చి చెప్పడమంటే, మొత్తంగా సినీ పరిశ్రమకే అది అతి పెద్ద షాక్‌. ఎనీ డౌట్స్‌.?

Show comments