హైడ్రామా.. ముచ్చటగా మూడోస్సారి

ఒకటోస్సారి.. ఏడు గంటలపైన విచారణ.. అరెస్టు ఊహాగానాలు.. చీకటి పడ్డాక విడుదల... 

రెండోస్సారి.. ఏడు గంటల పైన విచారణ.. అరెస్టు ఊహాగానాలు.. చీకటి పడ్డాక విడుదల... 

మూడోస్సారి.. ఏడు గంటల పైన విచారణ.. అరెస్టు ఊహాగానాలు.. చీకటి పడ్డాక విడుదల... 

వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డిని కాపు ఐక్య గర్జన తదనంతర పరిణామాల నేపథ్యంలో చోటు చేసుకున్న విధ్వంసానికి సంబంధించి విచారణ జరుపుతున్న సీఐడీ, నోటీసులు ఇచ్చి మరీ విచారణకు పిలిచింది. నేటితో కలిసి మొత్తంగా మూడు రోజులు, ఒక్కో రోజు ఏడు గంటలు.. మొత్తంగా దాదాపు 21 గంటల పైన సీఐడీ, భూమన కరుణాకర్‌రెడ్డిని గుంటూరులో విచారించింది. 

కొండను తవ్వి ఎలుకని పట్టిందా.? వైఎస్సార్సీపీ చెబుతున్నట్లు అసలు విచారణ ఏమీ లేదు, కక్ష సాధింపు చర్యల కోసం పిలిపించుకుని, కాఫీ - టీ - బిస్కట్‌ ఇచ్చి కూర్చోబెట్టారా.? ఈ అరెస్టు ఊహాగానాలేంటి.? ఈ ఊహాగానాలతో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందడమేంటి.? వీటన్నిటికన్నా ముందు, అధికార పార్టీకి వత్తాసు పలికే మీడియాలో ఊహాగానాల సంగతేంటి.? అంతా హంబక్‌.! ఇది చంద్రబాబు మార్క్‌ మాయ.! 

ఓటుకు నోటు కేసులో రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయిన రేవంత్‌రెడ్డి విషయంలోనూ ఇంత హంగామా జరిగి వుండదేమో. చంద్రబాబు బ్రీఫింగ్‌ ప్రపంచానికంతటికీ అర్థమయినా, చంద్రబాబు మాత్రం 'నన్ను టచ్‌ చేశారో మీ ప్రభుత్వం కూలిపోతుంది జాగ్రత్త..' అని తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించేశారు. మరి, ఏ ఆధారాలతో భూమన కరుణాకర్‌రెడ్డిని పదే పదే విచారణకు పిలుస్తున్నారట.? 

నిన్నటికి నిన్న రాజమండ్రిలో ఓ టీవీ ఛానల్‌ నిర్వాహకుడ్ని విచారించిన తర్వాత, భూమన కరుణాకర్‌రెడ్డిని మరోసారి విచారణకు పిలిపించడం వ్యూహాత్మకమనీ, అరెస్టు తప్పదనీ, విచారణ వివరాల్ని ఎలా అధికార పార్టీకి వత్తాసు పలికే మీడియాకి లీకులు అందినట్లు.? చెప్పుకుంటూ పోతే సవాలక్ష ప్రశ్నలు. దేనికీ చంద్రబాబు సర్కార్‌ నుంచి సమాధానాలు దొరకవు. 

భూమన కరుణాకర్‌రెడ్డి తప్పు చేసి వుంటే అరెస్టు చేసెయ్యొచ్చు. తర్వాత బెయిల్‌ ప్రక్రియ అనేది ఒకటి వుంటుంది. కానీ, చిత్రంగా ఇక్కడ విచారణ పేరుతో హైడ్రామా నడుస్తోంది. 'విషయం లేకుండా ఊరికినే విచారణకు పిలవం కదా..' అని సిఐడి అధికారులు చెప్పచ్చుగాక. కానీ, ఇదా పద్ధతి.? అన్న విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ, ఈ హైడ్రామా ఇంకెన్నాళ్ళు కొనసాగుతుందో ఏమో.!

Show comments