గుజరాత్ టీమ్ బాలేదంట 'దేశా'నికి

సోషల్ మీడియాలో పార్టీకి అనుకూలంగా ఏడాది పొడవునా పనిచేయడం అంటే అంత వీజీ కాదు. కాస్త జర్నలిజం టచ్ వున్నవాళ్లు కావాలి. నిత్యం రాజకీయాలు పరిశీలించాలి. ప్రతిపక్షాల సంగతి కంట కనిపెట్టి వుండాలి. మాంచి చమక్కు, సృజన వుండాలి. అప్పుడు అవి వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా జనంలోకి పంపించాలి. ఇందుకోసం ఒక్కొక్కరు పదేసి ఫేస్ బుక్ ఐడిలు పెట్టుకుని, వందల సంఖ్యలో ఫ్రెండ్స్ ను కలిగి వుండాలి. ఇదంతా పెద్ద టాస్క్. కాస్త ఖర్చుతో కూడుకున్న వైనం. ఎందుకంటే కనీసం ఓ అరడజను మందిని నెలనెలా జీతాలు ఇచ్చి పోషించాలి కదా.

పదేళ్లు అధికారంలో లేనపుడు తెలుగుదేశం పార్టీ మీడియా విభాగం ఇదే పని చేసింది. అయితే అప్పుడు కేవలం మీడియా విభాగమే కాకుండా, పార్టీ సానుభూతి పరులు కూడా ఈ తరహా సృజన వున్నవారు యథాశక్తి సహకరించారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చేసాక ఈ వ్యవహారం కొంత వరకు సద్దుమణిగింది.

ఇదిలా వుంటే ఇదే తరహా పనిని మోడీ ప్రధాని కావడం కోసం జాతీయ స్థాయిలో భారీ ఎత్తున నిర్వహించారు. కేవలం వాళ్లు చేసింది ఎదుటి వారిపై బురద జల్లడం కన్నా, మోడీ సమర్థతను, అవసరాన్ని, హిందూత్వను చాలా పద్దతిగా ప్రచారం చేసారు. ఇదంతా చాలా పకడ్బందీగా జరిగింది.

దీంతో తెలుగుదేశం పార్టీ కూడా తమ సోషల్ మీడియా బాధ్యతలను ఓ గుజరాత్ టీమ్ కు అప్పగించినట్లు తెలుస్తోంది. నేరుగా కాకుండా పార్టీలో నాయకుల ద్వారా ఈ బాధ్యతలు ఓ టీమ్ కు అప్పగించినట్లు వినికిడి. ఇప్పుడు ఈ టీమ్ సమర్థవంతంగా పనిచేయలేకపోతోందన్న గుసగుసలు పార్టీలో వినిపిస్తున్నాయట. ఈ టీమ్ కు, ఈ టీమ్ రిక్రూట్ చేసుకున్నవారికి. తెలుగు వెటకారం, తెలుగు నుడికారం, ఆంధ్ర రాజకీయాలు సరిగ్గా తెలియకపోవడమే ఇందుకు కారణం అని భావిస్తున్నారట. అందుకే మళ్లీ సరైన వాళ్లను తీసుకుని, స్వంత మీడియా విభాగం పర్యవేక్షణలోనే సోషల్ మీడియా ప్రచారాన్ని ఉధృతం చేయాలని పార్టీ పెద్దలు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

ఇప్పటి వరకు ప్రభుత్వ పాజిటివ్ ప్రచారమే జరిగింది. ఇక మీదట ఫేస్ బుక్ లో మళ్లీ వైకాపా నెగిటివ్ ప్రచారం ఉధృతం అవుతుందన్నమాట.

Show comments