చట్టసభలు సెల్ఫ్‌ డబ్బా కోసమేనా.?

'వాటర్‌ డే' సందర్బంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, అసెంబ్లీలో 'ప్రతిజ్ఞ' చేయించేశారు. ఈ మధ్య ఇదో ఫ్యాషన్‌ అయిపోయిందాయనకి. రాజధాని అమరావతి నిర్మాణం దగ్గర్నుంచి, దోమలపై దండయాత్ర వరకు.. చంద్రబాబు చేయించిన ప్రతిజ్ఞలు అన్నీ ఇన్నీ కావు. రాజకీయాల్లో కొత్త 'ట్రెండ్‌' సృష్టించేయాలన్నది చంద్రబాబు ఆలోచన. అందుకోసం ఆయనేవో పాట్లు పడ్తున్నారనుకోండి.. అది వేరే విషయం. 

అయితే, చట్ట సభల్ని చంద్రబాబు ఎలా ఉపయోగించుకుంటున్నారు.? అన్నదే ముఖ్యమిక్కడ. 'వాటర్‌ డే' సందర్భంగా ప్రతిజ్ఞ చేయించేశారు సరే.. ఈ సందర్భంగా చంద్రబాబు 'ప్రకటన' చేస్తున్నప్పుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎందుకు లేరు.? నిజమే, సభా నాయకుడి స్థానంలో ముఖ్యమంత్రి ప్రకటన చేస్తున్నప్పుడు ప్రతిపక్ష నేత అసెంబ్లీలో వుండాల్సిందే. కానీ, వైఎస్‌ జగన్‌ అండ్‌ టీమ్‌ సభ నుంచి వాకౌట్‌ చేసేసింది. 'ఇది అన్యాయం అధ్యక్షా..' అంటూ వాపోయారు చంద్రబాబు. వైఎస్‌ జగన్‌ మీద నిందారోపణలు మామూలే.! 

కానీ, జగన్‌ వాకౌట్‌ చేశాక.. చంద్రబాబు 'సెల్ఫ్‌ డబ్బా' మొదలెట్టాక, జగన్‌ సభ నుంచి వాకౌట్‌ చేయడమే కరెక్ట్‌.. అన్న అభిప్రాయం అందరిలోనూ కలిగింది. అవును మరి, చట్ట సభల్ని 'సెల్ఫ్‌ డబ్బా' కోసం ఓ మంచి వేదికగా చంద్రబాబు ఉపయోగించుకుంటోంటే, ఆ సమయంలో ప్రతిపక్ష నేత, అక్కడెందుకు వుండాలట.? 

పార్టీ సమావేశంలో చంద్రబాబు ఎంతైనా డబ్బా కొట్టుకోవచ్చు.. మీడియాని పిలిపించుకుని, ఆయన సొంత డబ్బా కొట్టుకోవచ్చు.. అంతేగానీ, చట్ట సభల్లో తాను సొంత డబ్బా కొట్టుకుంటోంటే, ఆ వ్యవహారాన్నంతా ప్రతిపక్ష నేత కూడా ఎంజాయ్‌ చెయ్యాలనుకోవడమేంటట.! దీన్ని పైశాచిక ఆనందం అనాలో, ఇంకేమన్నా అనాలో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. 

తన కుటుంబానికి రాజకీయమే ఆధారం కాకుండా వుండేందుకోసం హెరిటేజ్‌ సంస్థని చంద్రబాబు స్థాపించారట. తన జేబులో ఎప్పుడూ ఆయన డబ్బులు వుంచుకోరట. దేశానికి ప్రధానిని ఎంపి చేసే అవకాశం దేశంలోని పలువురు ముఖ్య నాయకులు ఆయనగారి భుజాన పెట్టారట. ఇవన్నీ పార్టీకి చెందిన ముఖ్య నేతలతో చెప్పించినా బాగుండేదేమో.! కానీ, ఎవరో ఆ భజన చేస్తే అంత బాగుండదనుకున్నట్టున్నారు.. అందుకే తన భజన తానే చేసేసుకున్నారు. అందుకు అసెంబ్లీని వేదికగా వాడేసుకున్నారు చంద్రబాబు. ముఖ్యమంత్రి అంటే, చట్ట సభల్ని తన జాగీరుగా వాడుకోవచ్చని.. బహుశా చంద్రబాబు చట్ట సభలకు కొత్త అర్థం చెబుతున్నట్టున్నారు. 

చాలా సందర్భాల్లో 'జగన్‌ ఇలా చేసి వుండకూడదేమో..' అన్పించినంతనే, 'జగన్‌ ఇలా చేయడమే కరెక్ట్‌..' అన్పించేలా చంద్రబాబు వ్యవహరిస్తుంటారు. అందుకే, చట్ట సభల్లో ఒక్కోసారి జగన్‌ అనుభవరాహిత్యంతో చేసే చిన్న చిన్న పొరపాట్లు.. కవర్‌ అయిపోతున్నాయ్‌. అదే సమయంలో, చంద్రబాబు సీనియారిటీ అభాసుపాలైపోతోంది.

Show comments