సల్మాన్‌ఖాన్‌ 'నిర్దోషి'.!

బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌.. ఇదొక్కటీ సల్మాన్‌ఖాన్‌ని కాపాడేసింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా పద్ధెనిమిదేళ్ళపాటు ఈ కేసులో సల్మాన్‌ఖాన్‌ తీవ్ర మానసిక సంఘర్షణ ఎదుర్కొంటున్నాడు. తనకున్న పాపులారిటీని ఉపయోగించుకుని, రాజకీయ ఒత్తిళ్ళు ప్రయోగించాడు.. ఇంకేవేవో చేశాడు.. జైలుకి కూడా వెళ్ళి వచ్చాడు. చివరికి 'నిర్దోషి' అనిపించుకున్నాడు. 

ఇట్‌ హ్యాపెన్స్‌ ఓన్లీ ఇన్‌ ఇండియా.! ఔను, ఇది నిజం. తప్ప తాగి, నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి, రోడ్డుపక్కనే నిద్రిస్తున్నవారిపైకి తన వాహనాన్ని పోనిచ్చి, ఒకరి మృతికి, మరికొందరు తీవ్రగాయాల పాలవడానికీ కారకుడైన సల్మాన్‌ఖాన్‌కి మొన్నామధ్య ఊరట లభించిన విషయం విదితమే. ఈ కేసులో సల్మాన్‌ఖాన్‌కి వ్యతిరేకంగా సాక్ష్యాధారాల్ని సేకరించడంలో విఫలమయ్యారన్న కారణంతో, కేసుని కొట్టేసింది న్యాయస్థానం. తాజాగా, చింకారా (కృష్ణ జింక) వేట కేసులో సల్మాన్‌ఖాన్‌ 'నిర్దోషి' అయ్యాడు. 

ఇది ఇప్పటి వ్యవహారం కాదు, 18 ఏళ్ళ క్రితం నాటి కేసు. అప్పట్లో కొందరు హీరోయిన్ల ముందు తన హీరోయిజం ప్రదర్శించాలనుకున్నాడు సల్మాన్‌ఖాన్‌. గన్ను చేతపట్టి, చింకారాలని వేటాడాడు. వాటి మాంసాన్ని ఆరగించాడు. పలువురు బాలీవుడ్‌ హీరోయిన్లపైనా ఈ వేటకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. ఆయుధాల్ని ఉపయోగించడం, వన్యప్రాణుల్ని వేటాడటం.. ఇలా రెండు కేసులు నమోదయ్యాయి సల్మాన్‌ఖాన్‌ మీద. ఏకంగా ఐదేళ్ళ జైలు శిక్ష కూడా విధించింది న్యాయస్థానం. కొన్నాళ్ళు జైల్లో వుండక తప్పలేదు సల్మాన్‌ఖాన్‌కి. ఆ సమయంలోనే కత్రినాకైఫ్‌, సల్మాన్‌ఖాన్‌కి దగ్గరయ్యింది. సల్మాన్‌ఖాన్‌ కోసం పరితపించింది కూడా. 

ఇక, ఇప్పుడు సల్మాన్‌ఖాన్‌ ఈ కేసు నుంచి బయటపడ్డాడు.. నిర్దోషిగా. ఓ పక్క కెరీర్‌లో బీభత్సమైన సక్సెస్‌లు, ఇంకోపక్క కేసుల నుంచి ఊరట.. బంపర్‌ ఆఫర్‌ అంటే ఇదేనేమో.! ఇప్పుడు ఒప్పుకుంటారా.? ఇట్‌ హ్యాపెన్స్‌ ఓన్లీ ఇన్‌ ఇండియా అని.!

Show comments