కేసీఆర్‌ అంతే.. ఆయనెవరికీ అర్థం కారు.!

పెద్ద పాత నోట్ల రద్దు వ్యవహారం తీసుకున్నా, జీఎస్‌టీ విషయం తీసుకున్నా.. ఆయా సందర్భాల్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రశేఖర్‌రావు, చంద్రబాబునాయుడు చాలా 'వింతగా' ప్రవర్తించారనే చెప్పాలి. 'తెలుగు రాష్ట్రాలకి నష్టమే.. కానీ, దేశం కోసం త్యాగం చేస్తున్నాం..' అంటూ అరివీర భయంకరులైన 'త్యాగధనులు'గా బిల్డప్‌ ఇచ్చారు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ.! 

చంద్రబాబుకెలాగూ తప్పదు.. ఎందుకంటే, ఎన్డీయేలో తెలుగుదేశం పార్టీ భాగస్వామి కాబట్టి. కేసీఆర్‌ పరిస్థితి అది కాదు. ఒక్కోసారి, బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌ నినదిస్తుంటుంది. ఇంకోసారి, అంశాల వారీగా మద్దతు.. అంటే కొత్త పల్లవి అందుకోవడం చూస్తున్నాం. ఒక్కమాటలో చెప్పాలంటే, టీఆర్‌ఎస్‌ది రెండు నాల్కల ధోరణి. నరేంద్రమోడీ, కేసీఆర్‌ 'భాయీ భాయీ..'. అదే రాష్ట్ర స్థాయిలో తీసుకుంటే మాత్రం బీజేపీకి, టీఆర్‌ఎస్‌కి మధ్య పచ్చగడ్డి వెయ్యకుండానే భగ్గుమంటుంది. 

ఇక, ఇప్పుడు అసలు విషయానికొస్తే, జీఎస్టీ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అగ్గిమీద గుగ్గిలమైపోతున్నారు. నిర్మాణంలో వున్న ప్రాజెక్టులకి 12 శాతం జీఎస్‌టీని ఆయన వ్యతిరేకిస్తున్నారు. చాలా చిత్రమైన విషయమే ఇది. జీఎస్‌టీకి పూర్తిగా మద్దతు ప్రకటించేశాక, ఇప్పుడిలా లొల్లి పెడితే ఎలా.? అదంతే, రాజకీయాల్లో అలాగే వుంటుంది మరి.! 

జీఎస్టీ అమల్లోకి వచ్చి నెల రోజులు దాటేసింది. కానీ, ఆ జీఎస్టీ మాయాజాలమేంటో ఇప్పటికీ ఎవరికీ అర్థం కావడంలేదు. చాలా వస్తువుల ధరలు తగ్గాయి, చాలా కొన్ని ధరలు మాత్రమే పెరిగాయన్నది కేంద్రం వాదన. మార్కెట్‌లో మాత్రం 'తగ్గుదల' కన్పించడంలేదు సరికదా, పెరుగుదల సామాన్యుడ్ని నిండా ముంచేస్తోంది. 'రేట్లు ఎందుకు తగ్గలేదు.?' అని చిరు వ్యాపారుల్ని సామాన్యుడు ప్రశ్నిస్తే, 'వెళ్ళి నరేంద్రమోడీని అడుగు..' అంటూ సమాధానమొస్తోంది. 

అసలంటూ జీఎస్టీని నిర్ణయించేది కేంద్రం కాదనీ, జీఎస్టీ కౌన్సిల్‌దే తుది నిర్ణయమని కేంద్రం చెబుతోంటే, ఆ జీఎస్టీ కౌన్సిల్‌లో భాగమైన రాష్ట్రాలు, జీఎస్టీ దెబ్బకు వ్యవస్థలన్నీ కుదేలవుతున్నాయంటూ గగ్గోలు పెడ్తుండడం గమనార్హం. ఇక్కడ మేటర్‌ క్లియర్‌.. రాష్ట్రాల హక్కుల్ని కేంద్రం తన గుప్పిట్లో పెట్టుకుంది. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే, రాష్ట్రాలన్నీ కేంద్రం వద్ద బిచ్చమెత్తుకునే పరిస్థితిని తీసుకొచ్చింది నరేంద్రమోడీ సర్కార్‌, జీఎస్టీ పుణ్యమా అని. 

ఈ పరిస్థితిపై ముందే చాలా అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, దాదాపు దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాల్లోనూ అధికార పార్టీలది ఒకటే వాదన. 'రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వం..' అంటూ ఏకగ్రీవ తీర్మానాలు చేసేశాయి. ఇప్పుడేమో, కేసీఆర్‌ కేంద్రంతో 'పంచాయితీ' పెట్టుకుంటామంటున్నారు. అప్పుడు అవకాశాన్ని వదిలేసుకుని, ఇప్పుడు ప్రశ్నిస్తామంటే, కేసీఆర్‌ని లెక్కచేసేదెవరు.?

Show comments