ఇది చంద్రన్న ఏరువాక.. కొత్తగా ఆంధ్రప్రదేశ్‌లో రైతులు వ్యవసాయం నేర్చుకుంటున్నారు.. ఔను, నేర్పుతున్నది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుగారే. నిజ్జంగా నిజమిది. అదేంటే, ఎన్నో తరాలుగా రైతులు వ్యవసాయం చేస్తన్నారు కదా.? అంటారా.? అదంతే. చంద్రబాబు ఇప్పుడు కొత్తగా వ్యవసాయం నేర్పుతున్నారు, నేర్చుకోవాల్సిందే.
ఆంధ్రప్రదేశ్ అంతటా ఈ రోజు ఏరువాక కార్యక్రమం ప్రారంభమయ్యింది. వివిధ జిల్లాల్లో మంత్రులు 'ఏరువాక' కార్యక్రమం షురూ చేశారు. రైతులకు వ్యవసాయంలో మెలకువలు నేర్పించారు. ఈ మెలకువలతో వ్యసాయం రైతులకు లాభసాటిగా మారుతుందట. వ్యవసాయంలో యంత్ర సామాగ్రి వినియోగం పెరగాలట. ఆ దిశగా ప్రభుత్వం, రైతులకు వ్యవసాయం గురించి పాఠాలు నేర్పించబోతోందట. వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే, చెప్పేవాడు టీడీపీ నేత.. అన్నట్టుంది వ్యవహారం.
మామూలుగా విజయవాడ నుంచి పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఎలా వెళతా.? రోడ్డు మార్గంలో చాలా తేలిగ్గా వెళ్ళొచ్చు. విజయవాడ నుంచి రైలు ప్రయాణం కూడా అత్యంత సౌకర్యవంతంగానే వుంటుంది. మరీ దూర ప్రయాణమేమీ కాదు. గట్టిగా అంటే ఓ మూడు గంటల ప్రయాణమే. రోడ్డు మార్గంలోనూ, రైలు మార్గంలోనో వెళితే ఆయన చంద్రబాబు ఎలా అవుతారు.? అందుకే, చంద్రబాబు గన్నవరం విమానాశ్రయం నుంచి విజయవాడకు వెళ్ళారు. అక్కడి నుంచి నర్సాపురం వెళ్ళారు. దటీజ్ చంద్రబాబు. హీ ఈజ్ మిస్టర్ 'డాబు' బాబు.!
అప్పుడెప్పుడో వ్యవసాయం దండగ.. అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అది వైఎస్ జమానా. అప్పటినుంచీ ఇప్పటిదాకా చంద్రబాబుపై 'రైతు వ్యతిరేకి' అన్న ముద్ర చెరిగిపోలేదు. 'అబ్బే.. నేను అనలేదు..' అని చంద్రబాబు మొత్తుకుంటూనే వుంటారనుకోండి.. అది వేరే విషయం. స్వర్గీయ ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచిన మచ్చ, రైతుల్ని నట్టేట్లో ముంచేశారన్న మచ్చ.. చంద్రబాబుకి ఎప్పటికీ మాసిపోవు. ఆ మచ్చని చెరిపేసుకునేందుకే.. ఇలా ఏరువాక ప్రారంభించారు చంద్రబాబు.
పుష్కలంగా పంటలు పండే పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు ఏరువాక ప్రారంభించారు బాగానే వుంది.. అదేదో రాయలసీమలో చేసి వుంటే, పరిస్థితి ఇంకోలా వుండేది. పట్టిసీమతో రాయలసీమకు నీళ్ళిస్తామని చెప్పారాయన. ఏదీ ఎక్కడ.? అని రాయలసీమ రైతులు అడుగుతున్నారు. ఇదిగో, ఇవీ పట్టిసీమ నీళ్ళు.. అంటూ ఏరువాక పేరుతో రాయలసీమ రైతుల అనుమనాల్ని తీర్చి వుంటే బాగుండేది కదా.?
ఇంకా నయ్యం.. చంద్రబాబు అలా ఎందుకు చేస్తారు.? అభివృద్ధి చెందిన హైద్రాబాద్‌ని నిర్మించింది తానేనంటారు. ఔనా, అలాగైతే ఆంధ్రప్రదేశ్‌లో విశాఖనో, ఇంకో నగరాన్నో హైటెక్‌గా మార్చేయొచ్చు కదా.. అనడిగితే 'నో కామెంట' అంటారాయన. ఏరువాక కూడా అంతే. పబ్లిసిటీ కోసం కోట్లు ఖర్చుపెట్టిన చంద్రబాబు, ఏరువాక పేరు చెప్పి, 'రైతు వ్యతిరేకి' అనే మచ్చని చెరిపేసుకోవాలనుకుంటున్నారు. చెరిగిపోతుందా మరి.?
కొసమెరుపు: నాగలితో చంద్రన్న పొలంలోకి దిగి, బురదను లెక్కచెయ్యకుండా.. జోడెద్దుల్ని అదిలించారు. ఆ జోడెద్దుల కొమ్ములకు పూసిన రంగేమిటో తెలుసా.? ఇంకే రంగు, పసుపు రంగు. దటీజ్ చంద్రబాబు.