ఆస్తులమ్మేసే వారసత్వం ఇదేనండీ.!

మేనత్త ఆస్తులమ్మేసేంతటి ఘనుడు జయలలిత మేనల్లుడు. నిజ్జంగానే నిజమిది. జయలలిత ఆస్తులు అమ్మేసి, న్యాయస్థానానికి 100 కోట్లు కట్టేస్తాడట. నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.. అన్నట్టుంది జయలలిత మేనల్లుడు దీపక్‌ జయకుమార్‌ తీరు. శశికళ జైలుకెళ్ళడంతో, పార్టీ పగ్గాలు తనకే దక్కుతాయనుకున్న దీపక్‌ జయకుమార్‌కి ఆమె పెద్ద షాకే ఇచ్చారు. శశికళ తన బంధువు అయిన దినకరన్‌కి పార్టీ పగ్గాల్ని అప్పగించిన విషయం విదితమే. 

'శశికళ నాయకత్వాన్ని గౌరవిస్తాను.. అంతేగానీ, శశికళ బంధువుల చేతుల్లో పార్టీని పెడతామంటే ఊరుకునేది లేదు..' అంగూ దీపక్‌, తాజాగా అల్టిమేటం జారీ చేశారు. అంతేనా, తాను మేనల్లుడిని గనుక.. జయలలితకు వారసులెవరూ లేరు గనుక, తానే నిజమైన వారసుడిననీ, జయలలితకు చెందిన ఆస్తుల్లో కొన్నిటిని అమ్మేసి, సుప్రీంకోర్టుకి జరీమానా కడతామనీ సెలవిచ్చారాయన. 

మరోపక్క, రేపు (ఫిబ్రవరి 24) జయలలిత జయంతి సందర్భంగా ఆమె మేనకోడలు దీపా జయకుమార్‌, కొత్త పార్టీ పేరుని ప్రకటించేందుకు సమాయత్తమవుతున్నారు. మొన్నీమధ్యనే పన్నీర్‌ సెల్వంకి మద్దతిచ్చిన దీప, ఇప్పుడు కొత్త పార్టీ పెడతానంటుండడం గమనార్హం. మేనల్లుడు, మేనకోడలి తీరు ఇలా వుంటే, నిచ్చెలి శశికళ ఆలోచనలు మరోలా వున్నాయి. తన వద్దకు వస్తానన్న ముఖ్యమంత్రి పళనిసెల్వంని రావొద్దని చెప్పి మరీ, తమిళనాడు వ్యాప్తంగా అమ్మ జయంతి వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారామె. అదే సమయంలో, దీపక్‌ జయకుమార్‌ తీరుపైనా శశికళ ఓ కన్నేశారట. 'పోతే పోనీ..' అన్నట్టుగా వ్యవహరించాలని పార్టీ నేతలకు ఆమె సూచించినట్లు తెలుస్తోంది.

'జయలలిత ఆస్తుల విషయంలో ఆమె వారసులెవరికీ అవకాశమే లేదు. పోయెస్‌ గార్డెన్‌ సహా జయలలిత ఆస్తులన్నీ పార్టీకే చెందుతాయ్‌..' అంటూ శశికళ తెగేసి చెబుతున్నారట. జైలు నుంచే శశికళ వ్యవహారాలన్నీ చక్కబెట్టేస్తున్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! 

మొత్తమ్మీద, అమ్మ జయలలిత జయంతి వేడుకల సందర్భంగా తమిళనాడులో రసవత్తర రాజకీయాలకు తెరలేవనుందన్నమాట.

Show comments