అనితకి విద్యాశాఖ: బాబుగారు ఇస్తారా మరి.?

మంత్రి పదవి కోసం నానా తంటాలూ పడ్డారామె. అధినేత చంద్రబాబు మెప్పు పొందగలిగితే, మంత్రి పదవి దక్కుతుందని ఆమె పడ్డ ఆరాటం అంతా ఇంతా కాదు. ఈ క్రమంలోనే, 'టార్గెట్‌ రోజా' అనే ఆపరేషన్‌ని విజయవంతంగా చేపట్టారు. తెలుగుదేశం పార్టీలో అనూహ్యంగా 'పాపులారిటీ' పెంచుకున్న ఆమె ఎవరో కాదు, ఎమ్మెల్యే అనిత. 

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల్లో రోజా వర్సెస్‌ అసెంబ్లీ పెద్ద రచ్చే జరిగింది. ఈ క్రమంలోనే, రోజాపై సస్పెన్షన్‌ వేటు వ్యవహారమూ తెరపైకొచ్చింది. 'నాపై వ్యక్తిగత నిందారోపణలు చేశారు..' అంటూ అప్పట్లో అనిత, కంటతడిపెట్టడం తెల్సిన విషయమే. అయినా, చంద్రబాబుకి ఇలాంటివన్నీ మామూలే. 'ముల్లుని ముల్లుతోనే తియ్యాలి..' టైపు 'వ్యూహాల్ని' రచించడంలో దిట్ట. దళిత నేతను విమర్శించడానికి దళిత నేతని తెరపైకి తేవడం.. మైనార్టీ వర్గానికి చెందిన నేతని విమర్శించాలంటే ఆ వర్గానికి చెందిన నేతనే పురమాయించడం.. ఇవన్నీ చంద్రబాబు మార్కు రాజకీయ వ్యూహాలు. 

అలా, అనితనీ రోజాపైకి 'మహిళా కోటా'లో పురమాయించి, చంద్రబాబు ఒకింత రాజకీయంగా పై చేయి సాధించారనే చెప్పాలి. ఆ విషయం పక్కన పెడితే, చంద్రబాబు డైరెక్షన్‌లో అత్యుత్సాహం చూపినప్పటికీ, అధినేత మెప్పు పొందినప్పటికీ, మంత్రి పదవి మాత్రం అనితను వరించలేదు. అయినాసరే, ఆమె తనకు మంత్రి పదవి దక్కుతుందనే గట్టి పట్టుదలతో వున్నారు. 

'విద్యాశాఖ' మంత్రిగా తనకు అవకాశం దక్కబోతోందని గతంలో సన్నిహితుల వద్ద చెప్పుకున్నారట కూడా. 'ఆ పదవి నాకు దక్కితే చాలా చాలా చేయాలని వుంది..' అంటూ తాజాగా విద్యా శాఖపై తన మమకారాన్ని చాటుకున్నారు అనిత. ముఖ్యమంత్రిగా చంద్రబాబు మూడేళ్ళ పాలనని పూర్తి చేసేసుకున్నారు. ఇక మిగిలింది రెండేళ్ళు.! ఏమో, గుర్రం ఎగరావచ్చు.. అనితకి మంత్రి పదవీ దక్కొచ్చు.. అనుకోగలమా.? Readmore!

Show comments