తమిళనాడు భవిష్యత్తేంటి.?

తమిళనాడు రాజకీయాలు చాలా చిత్రంగా వుండేవి. దేశ రాజకీయాలకు భిన్నంగా అక్కడ రాజకీయం కన్పించేది. ఏఐఏడీఎంకే, డీఎంకే తప్ప ఇంకో రాజకీయ పార్టీకి అక్కడ చాలాకాలంగా 'సరైన చోటు' లేదన్నది నిర్వివాదాంశం. తమిళనాడులో జాతీయ పార్టీలది చాలా దయనీయమైన పరిస్థితి. ఏదో ఒక పార్టీ మద్దతు లేకుండా జాతీయ పార్టీలు తమ ఉనికిని చాటుకోలేని దుస్థితి తమిళనాడులో నిన్న మొన్నటిదాకా చూశాం. 

చాలా విషయాల్లో తమిళనాడుని 'టచ్‌' చేయడానికి కూడా జాతీయ పార్టీలు భయపడేవి. అంతెందుకు, శ్రీలంక తదితర అంశాలపై కేంద్రాన్ని ఎదిరించి తమిళనాడు వ్యవహరించిన సందర్భాలున్నాయి. కేంద్రం తీరుకు వ్యతిరేకంగా తమిళనాడు శాసనసభ తీర్మానాలు చేసిన సందర్భాలు అనేకం. 'మేం ప్రత్యేక దేశంగా వుండిపోతాం..' అనే డిమాండ్లు కూడా అప్పుడప్పుడూ తమిళనాడు నుంచి తెరపైకొస్తుంటాయి. అందుకే, తమిళనాడు దేశ రాజకీయాల్లో వెరీ వెరీ స్పెషల్‌గా వుంది ఇప్పటిదాకా. 

అయితే, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అక్కడ 'బలమైన నాయకత్వం' లేకుండా పోయిందిప్పుడు. వయసు మీదపడ్డంతో గత అసెంబ్లీ ఎన్నికల నాటికే కరుణానిధి నేతృత్వంలోని డీఎంకే పార్టీ నైతికంగా బలహీనపడింది. ఏఐఏడీఎంకే పార్టీకి జయలలిత మృతితో కోలుకోలేని దెబ్బ తగిలింది. ప్రస్తుత పరిణామాలు అక్కడ నివురుగప్పిన నిప్పులా వున్నాయన్నది నిర్వివాదాంశం. సరిగ్గా టైమ్‌ చూసి దెబ్బ కొడ్తోంది కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్‌. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తమిళనాడు సీఎస్‌పై ఐటీ దాడులు జరిగాయి. తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పగల 'శేఖర్‌రెడ్డి'తో మొదలైంది ఈ ఐటీ దాడుల వ్యవహారం. 

పెద్ద పాత నోట్ల రద్దు మిగతా రాష్ట్రాల్లోని రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందోగానీ, జయలలిత మరణం - కరుణానిధి అనారోగ్యం తదితర ప్రత్యేక పరిస్థితుల్లో డీలాపడ్డ తమిళనాడు రాజకీయాలపై మాత్రం ఇప్పుడు పిడుగు పడిందని చెప్పక తప్పదు. పెద్ద పాత నోట్ల రద్దు తదనంతర పరిణామాల పేరుతో కేంద్రం, తమిళనాడు రాజకీయాలపై కక్ష కట్టిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌.  Readmore!

ఈ పరిస్థితుల్లో తమిళనాడులో కొత్త నాయకత్వం పుట్టుకొచ్చే అవకాశమే కన్పించడంలేదు. డీఎంకే, ఏఐఏడీఎంకే పూర్తిస్థాయిలో బలహీనపడిపోతే, ఆ తర్వాత జాతీయ పార్టీలదే హవా..అన్న భావనతో వుంది కేంద్రంలోని మోడీ సర్కార్‌. జయలలిత మరణానంతరం, ఆమె పార్తీవ దేహానికి నివాళులర్పించిన మోడీ, అక్కడే వున్న శశికళతో ప్రత్యేకంగా మాట్లాడటం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఆ సమయంలో అక్కడికి లక్షలాదిగా విచ్చేసిన జయ అభిమానుల్ని ఉద్దేశించి నరేంద్రమోడీ అభివాదం చేసిన తీరూ చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఆనాటి అభివాదానికి అసలు అర్థం ఇదిగో ఇప్పుడు కన్పిస్తోంది. 

ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల్ని నిర్వీర్యం చేసే క్రమంలో వ్యూహాత్మకంగా విభజన అస్త్రాన్ని కాంగ్రెస్‌, బీజేపీ తెరపైకి తెచ్చాయి. చిత్రంగా ఈ గేమ్‌లో జాతీయ పార్టీ కాంగ్రెస్‌ చిత్తు చిత్తయ్యింది. బీజేపీ కాస్తంత బలం పుంజుకోగలిగిందనుకోండి.. అది వేరే విషయం. అప్పటిదాకా దక్షిణాదిలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ఫుల్‌ స్టేట్స్‌గా వుండేవి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఇప్పుడు సవాలక్ష సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. తాజాగా తమిళనాడు ఇప్పుడు రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయింది. 

ఈ పరిస్థితుల్లో తమిళనాడు మళ్ళీ పుంజుకోగలదా.? బలమైన శక్తిగా తన సత్తా చాటుకోగలదా.? వేచి చూడాల్సిందే.

Show comments

Related Stories :