'గ్లామరస్ పాత్రలతో ఆడియన్స్‌కి చేరువయ్యే అవకాశాలుంటాయి. స్టార్ హీరోల సినిమాల్లో చేయాల్సి వచ్చినప్పుడు గ్లామర్ విషయంలో ఏ మాత్రం మొహమాటపడకూడదు. నిజానికి అదేమీ తప్పు కాదు కూడా. నటనలో గ్లామర్ కూడా ఓ భాగమే. గ్లామర్ వేరు ఎక్స్‌పోజింగ్ పేరుతో ప్రదర్శించే వల్గారిటీ వేరు..' అంటూ గ్లామరస్ పాత్రల గురించి తనదైన అభిప్రాయాన్ని కుండబద్దలు గొట్టేసింది 'లోఫర్' ఫేం దిశా పటానీ.
తన వరకూ తాను నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్నే ఎంచుకోవాలనుకుంటాననీ, అయితే వెండితెరపై నటిగా అవకాశాలు దక్కించుకోవాలంటే గ్లామరస్ పాత్రల్లో నటించక తప్పదని దిశా పటానీ చెప్పుకొచ్చింది. నటిగా గుర్తింపు వచ్చాక, గ్లామరస్ పాత్రలు చేస్తూనే నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్ని ఎంచుకోవడం ద్వారా ఆడియన్స్‌కి మరింత చేరువయ్యే అవకాశం దక్కుతుందట.
బయోపిక్స్ అంటే తనకు ఇష్టమనీ, అలాగే టామ్ బాయ్ తరహాలో వెండితెరపై విలక్షణ పాత్రల్లో కన్పించాలనుకుంటాననీ, తన ఫిజిక్ యాక్షన్ గర్ల్ ఇమేజ్‌కి బాగా సూటవుతుందనీ అంటోంది దిశా పటానీ. తెలుగులో 'లోఫర్' సినిమాలో నటించిన దిశా పటానీ, బాలీవుడ్ సినిమాల్లో నటిస్తే రీచ్ ఎక్కువగా వుంటుందనీ, తెలుగు సినిమాలు అభిమానాన్ని తెచ్చిపెడ్తాయనీ అభిప్రాయపడింది. మొదట్లో గ్లామరస్ పాత్రలే చేసినా, ఆ తర్వాత నటనకు ప్రాధాన్యం వున్న పాత్రల్ని ఎంచుకుంటున్న కంగనా రనౌత్‌ని ఫాలో అవుతుందట ఈ అందాల భామ.