మోడీ మీద గుర్రుమంటున్న కమలదళం!

నరేంద్రమోడీకి విధేయంగానీ దేశమంతా భాజపా నాయకులు మనుగడ సాగిస్తున్నారు.  ఎవ్వరూ కాదనలేని తరహాలో, కాంగ్రెస్ అలవాట్లు భాజపాలోకి కూడా వచ్చేశాయి. అయితే తాజా పరిణామాల్లో తెలంగాణ భాజపా నాయకులు, మోడీ మీద గుర్రుమంటున్నారట. 

ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించి వెళ్లడం ద్వారా ఏం సాధించారు? ఈ ప్రశ్నకు ఇప్పుడు ఎవ్వరి వద్దా ఎలాంటి సమాధానమూ లేదు. ఆయన గతంలో అమరావతిలో పర్యటించి ఏం సాధించారో.. ఇప్పుడు తెలంగాణలో పర్యటించి కూడా అదే సాధించారు! పార్టీ పరంగా జరిగింది మాత్రం అంతే! అప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనూ, ఇప్పుడు తెలంగాణలో కూడా మోడీ పర్యటన తర్వాత.. భాజపా శ్రేణులు కుదేలైపోయాయి. డీలా పడి.. ఏమి ఖర్మ వచ్చిందిరా భగవంతుడా, మోడీ వచ్చి మనల్ని నట్టేట ముంచేలా ఉన్నాడే అని విచారించే పరిస్థితి ఏర్పడింది. 

ఎలాగంటే.. 

అమరావతి శంకుస్థాపనకు వచ్చి ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజలు అసహ్యించుకునేలా కొత్త రాజధానికి ఒక్క రూపాయి నిధులు కూడా ప్రకటించకుండా వెళ్లిన మోడీ వలన.. ఆ రాష్ట్రంలో భాజపా చాలా కాలం పాటు తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు తెలంగాణలో నేపథ్యం వేరు. ఇక్కడ మోడీ నుంచి అనగాకేంద్రం నుంచితమకు నిధులు అవసరమే లేదని, ఏకంగా సీఎం కేసీఆరే అంటున్నారు. అలాంటి నేపథ్యంలో మోడీ నిధులు ప్రకటించకపోయినంత మాత్రాన ప్రజలు తిట్టుకోవడం, భాజపా ఇబ్బందుల్లో పడడం అవకాశం లేదు. కాకపోతే.. తెలంగాణ భాజపాకు ఇబ్బంది మరో రూపంలో వచ్చింది. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రధాని నరేంద్ర మోడీ విపరీతంగా కీర్తించారు. 'ఏ లక్ష్యం కోసం తెలంగాణ ఆవిర్భవించిందో.. ఆ స్వప్నాల్ని పూర్తి చేస్తుందనిపిస్తోంది. తెలంగాణలో ఈరోజు పంచశక్తి దర్శనమైంది..' ఈ తరహాలో మోడీ కేసీఆర్‌ పరిపాలనను భయంకరంగా కీర్తించారు. నీటి పథకాల కోసం కసరత్తు కృషి అనేది కేసీఆర్‌ జీవన మిషన్‌ లా మారిందనే పొగడ్త చాలా పెద్దది. రైతులకు సాగునీరు ఇవ్వడానికి చేపడుతున్న కేసీఆర్‌ ప్రాజెక్టుల్ని కూడా మోడీ ఆకాశానికి ఎత్తేశారు. 

సరిగ్గా ఈ వ్యవహారమే తెలంగాణ భాజపా నాయకులకు మింగుడు పడడం లేదు. కేసీఆర్‌ చేపట్టిన మిషన్‌ భగీరథ, ప్రాజెక్టుల కార్యక్రమాల్లోను లోపాలున్నాయని, అవినీతి ఉన్నదని రాష్ట్ర భాజపా పోరాడుతోంది. అడపాదడపా కేసీఆర్‌ సర్కారును ఇబ్బంది పెట్టే ప్రయత్నంచేస్తున్నది. అలాంటి నేపథ్యంలో స్వయంగా ప్రధాని వచ్చి కేసీఆర్‌ చేపడుతున్న ప్రతి పనినీ ఇంత భారీ స్థాయిలో పొగిడేసి వెళ్లిపోయాక, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఇక తాము విమర్శిస్తే విలువ ఉండదని వారు అనుకుంటున్నారు. అలాగే... భాజపా స్వతంత్ర శక్తిగా ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలతో ఎదిగే ప్రక్రియ కూడా ఆలస్యం అవుతుందని భయపడుతున్నారు. 

ఒకవైపు పార్టీ నాయకుల సమావేశం జరిగితే అందులో కేంద్ర మంత్రులు అందరూ వచ్చే 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం సాధించే దిశగా, పార్టీ నిర్మాణం ఉండాలంటూ చిలక పలుకులు పలికారు. కానీ, ప్రధాని మాత్రం ఆ ప్రయత్నాలకు విఘాతం కలిగించేలాగా కేసీఆర్‌ను కీర్తించి వెళ్లారని తెభాజపా నాయకులు బాధపడుతున్నారు. అందుకే పైకి మోడీని ఏమీ అనలేని తెలంగాణ భాజపా నాయకులు లోలోన మాత్రం ఆయన మీద కుతకుత లాడిపోతున్నారట.

Show comments