అఖిల్‌ రికార్డుల రారాజు.!

అఖిల్‌ ఎందుకిలా చేస్తున్నాడు.? తొలి సినిమా 'అఖిల్‌' తర్వాత అక్కినేని అఖిల్‌ హీరోగా నటించే ఇంకో సినిమా ఎందుకు సెట్స్‌ మీదకు రాలేదు.? అసలేం జరుగుతోంది.? అక్కినేని అభిమానుల్లో ఇదే టెన్షన్‌. టెన్షన్‌ పెరగడం తప్ప, అఖిల్‌ నుంచి తదుపరి సినిమాపై క్లారిటీ రావడంలేదు. 

ఓ పక్క అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన రెండు సినిమాలు విడుదలకు నోచుకోవడంలేదు. 'సాహసం శ్వాసగా సాగిపో', 'ప్రేమమ్‌' చిత్రాలు తెరకెక్కి విడుదలకు సిద్ధంగా వున్నాయి. కానీ ఏం లాభం.? అవెప్పుడు రిలీజవుతాయో ఎవరికీ తెలియని పరిస్థితి. నాగచైతన్య అలా అఖిల్‌ ఇలా.. వెరసి, నాగార్జునకి టెన్షన్‌ పెరిగిపోతోంది. 

వంశీ పైడిపల్లి, కళ్యాణ్‌ కృష్ణ, హను రాఘవపూడి, మారుతి, ఇప్పుడు కొత్తగా 'పెళ్ళిచూపులు' డైరెక్టర్‌.. మధ్యలో ఇంకా చాలామంది దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. వీటిల్లో వంశీ పైడిపల్లి, హను రాఘవపూడి పేర్లు దాదాపు ఖాయమై, కొన్ని కారణాలతో ఆ ప్రాజెక్టులు అటకెక్కేశాయి. ప్రొడక్షన్‌ బ్యానర్‌ పరంగా అఖిల్‌కి సమస్యలేమీ లేవు. కానీ, డైరెక్టర్లతోనే అఖిల్‌కి 'కెమిస్ట్రీ' సెట్టవడంలేదు. అఖిల్‌ రిక్వైర్‌మెంట్స్‌ని ఆ దర్శకులు మ్యాచ్‌ చేయలేకపోండడంతోనే ఈ పరిస్థితి ఎదురవుతోందట. 

అఖిల్‌ ఇంకా సింగిల్‌ సినిమా అనుభవం వున్న యువ హీరో మాత్రమే. ఇప్పుడే పరిస్థితి ఇలా వుంటే, ముందు ముందు అఖిల్‌తో కష్టమేనన్న అభిప్రాయం సినీ పరిశ్రమలో బలపడిపోతోంది. ఇంతమంది దర్శకుల్ని ఎంగేజ్‌ చేసి, వారికి హ్యాండివ్వడం ద్వారా అఖిల్‌ కొత్త రికార్డు సృష్టించాడనుకోవాలా.? లేదంటే, చెత్త రికార్డుని ఈ యువరాజు మూటగట్టుకుంటున్నాడనుకోవాలా.? ఏమో మరి.!

Show comments