కిరణ్ బేడి: కబాలి టికెట్లకు కొత్త ఆఫర్!

పాండిచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్ గా వచ్చిన కిరణ్ బేడీ అక్కడ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ప్రచారం కల్పించడానికి, మరుగుదొడ్ల నిర్మాణాన్నిప్రోత్సహించడానికి ‘కబాలి’ సినిమాను ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటికే ఒక విమానయాన సంస్థ వాళ్లు రజనీకాంత్ మానియాను వాడుకొంటున్నట్టుగా ఒక మంచి పని కోసం కిరణ్ బేడి పాండిచ్చేరి ప్రభుత్వం ద్వారా కొత్త ఆఫర్ ప్రకటింపజేశారు. దాని ప్రకారం ఎవరైతే తమ ఇంటికి టాయ్ లెట్ ను నిర్మించుకుంటారో వారికి కబాలి సినిమా టికెట్లను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది.

పాండిచ్చేరిలోని సెల్లిపేట్ అనే గ్రామానికి ఈ ఆఫర్ ను ప్రకటించింది ప్రభుత్వం. ఈ గ్రామంలో సగానికి సగం ఇళ్లకు టాయ్ లెట్ సౌకర్యం లేదు. ఇక్కడి గ్రామీణులను మరుగుదొడ్డి విషయంలో అవగాహనవంతులను చేయడానికి కబాలి సినిమాను ఉపయోగించుకుంటోంది ప్రభుత్వం. రజనీకాంత్ సినిమాకు తమిళం మాట్లాడే ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో ఉన్న క్రేజ్ గురించి వేరే వివరించనక్కర్లేదు. ఇలాంటి నేపథ్యంలో కబాలి సినిమా టికెట్లను ఉచితంగా ఇస్తాం.. మీ ఇంటికి టాయ్ లెట్ ను నిర్మించుకొండన్న పిలుపు ప్రజల్లో అవగాహన నింపేదే అవుతుంది.

అలాగే ఇక్కడ స్వచ్ఛ భారత్ విషయంలో రజనీని ప్రచార కర్తగా ఉండాలని రజనీని కోరాలని కిరణ్ బేడీ భావిస్తున్నారట. మొత్తానికి రజనీకాంత్ ‘కబాలి’ క్రేజ్ కు కొత్త నిర్వచనం ఇస్తోంది. 

Readmore!
Show comments