క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమాని తలపించేస్తోంది.!

ఆమె మీద ఓ సినీ ప్రముఖుడు కన్నేశాడు.. ఆమెను ఎలాగైనా రచ్చకీడ్చాలనుకున్నాడు.. అంతే, సుపారీ ఇచ్చాడు.. ఆమెపై లైంగిక వేధింపులు జరిగేలా చేశాడు.. ఇందుకోసం భారీగా ఖర్చు చేశాడు.. ఇదీ, హీరోయిన్‌ భావన కిడ్నాప్‌ - లైంగిక వేధింపులకు ఘటనకు సంబంధించి తాజాగా వెలుగులోకి వచ్చిన సమాచారం. పోలీసులు, ఇప్పటికే అరెస్ట్‌ చేసిన నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్‌ ఫోన్ల ద్వారా మొత్తం 'కుట్ర'ని వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తోంది. 

ఒక్క మాటలో చెప్పాలంటే, ఇదంతా క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమాని తలపిస్తోంది. ఓ హీరోయిన్‌ విషయంలో ఇంతగా పగపట్టేయడాల్సిన అవసరం సదరు సినీ ప్రముఖుడికి ఎందుకొచ్చిందట.? ఇదే ఇప్పుడెవరికీ అర్థం కాని ప్రశ్న. 'దాడి' చేస్తే ఎవరికీ చెప్పుకోలేదులే.. అన్నట్లుగా సదరు సినీ ప్రముఖుడు అనుకుని వుండాలి. అందుకే, తన వ్యూహాన్ని పక్కాగా అమలు చేసేశాడన్నమాట. అయితే, అనూహ్యంగా భావన ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతకన్నా అనూహ్యంగా ఆమెకు సినీ, రాజకీయ వర్గాల నుంచి మద్దతు పెద్దయెత్తున లభిస్తోంది. సామాన్యులు సైతం ఈ విషయంలో భావనకి బాసటగా నిలిచారు. 

దాంతో, సదరు సినీ ప్రముఖుడి క్రూరత్వం తెరపైకి రావడం దాదాపు ఖాయమైపోయింది. మొదట్లో ఎవరో ఆవారాగాళ్ళు ఈ పని చేశారని అంతా అనుకున్నారు. కానీ, ఇంతలా.. ఇంత హేయంగా సినీ పరిశ్రమకు చెందినవారే ఆమెపై కుట్రపూరితంగా ఇంతటి దారుణానికి ఒడిగట్టడాన్ని సినీ పరిశ్రమలో ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. 'ఈ రోజు భావనకి.. రేపు నాకు కావొచ్చు, ఇంకొకరికి కావొచ్చు..' అంటూ హీరోయిన్లు, సీనియర్‌ నటీమణులు.. భావన కిడ్నాప్ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండడం గమనార్హం. 

మొత్తమ్మీద, ఆ సినీ ప్రముఖుడి బండారం బయటపడటానికి రంగం సిద్ధమయిపోయినట్లే. బండారం బయటపడ్తుంది సరే.. శిక్ష సంగతేంటి.? వేచి చూడాల్సిందే.

Show comments