జనవాక్యం - కొండమీద రహస్యం

‘ ఏమిటా మాటలు అంత పెద్దగా వినిపిస్తున్నాయి ‘ అని అడిగాడట వెనకటికి ఒకడు . మరొకడ్ని. ‘ అదా..అది మరేం లేదు..ఎవరో ఇద్దరు ఊళ్లో మాట్లాడుకుంటే తెలియదని, దూరంగా కొండ మీదకు వెళ్లి రహస్యం మాట్లాడుకుంటున్నారు’ అన్నాడట. మన ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్ రహస్యాలు ఇలాగే వున్నట్లు కనిపిస్తోంది. స్వచ్ఛంధ ఆదాయం వెల్లడి స్కీముపై బయటకు వస్తున్న వార్తల వైనాలు చూస్తుంటే.

హైదరాబాద్ లో ఓ ఆసామీ ఏకంగా పది వేల కోట్ల లెక్కలు చూపని ధనం డిక్లేర్ చేసినట్లు స్వచ్ఛంధ ఆదాయ పన్ను పథకం క్లోజ్ అయిన మర్నాడే పత్రికల్లో వచ్చింది. ఆ రావడమే ఒకటి రెండు పత్రికల్లో జనాలకు డవుట్ పుట్టేలా వచ్చింది. ఆ తరువాత తెలుగుదేశం జనాలు అలా వెల్లడించింది వైకాపా అధ్యక్షుడు జగనే అని బహిరంగంగా ఆరోపించడం ప్రారంభించారు. అది కాస్త ముందుకు వెళ్లింది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా తన స్థాయి మరిచి, ‘ ఆ పదివేల కోట్లు ఇచ్చింది ఎవరో అందరికీ తెలుసు’ అని కామెంట్ విసిరారు.

దాంతో తేనెతుట్ట కదిలింది. వైఎస్ జగన్..కేంద్ర ఆర్థికమంత్రికి లేఖ రాసారు. ఆదాయపన్ను శాఖ వివరాలు బయటకు ఎలా వచ్చాయి అంటూ..నిజానికి జగన్  సరైన కౌంటర్ ఇవ్వలేకపోయారనే చెప్పాలి.  ఇలా రాసే బదులు..ఆ పదివేలు కట్టింది ఎవరో జనాలకు చెప్పండి..అది నేనే అంటూ ఆరోపణలు చేస్తున్నారు..అందువల్ల క్లారిటీ ఇవ్వండి అని అడిగివుంటే బాగుండేది. ఆ పై ఉండవల్లి కూడా జగన్ తరహాలోనే మాట్లాడారు తప్ప, కౌంటర్ ఇచ్చేలా కాదు.

అంటే మొత్తం మీద తెలుగుదేశం పార్టీ చాలా తెలివిగా జనంలోకి ఇంజెక్ట్ చేసిన అనుమానాన్ని నివృత్తి చేసే ప్రయత్నం కానీ, ఆ అనుమానాన్ని వేరేవాళ్లపైకి తిప్పే ప్రయత్నం కానీ, వైకాపా నేతలు చేయలేకపోయారు. అది వాస్తవం. అనుభవం పండిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా అదే అంటున్నారు. ఆయన తన రెగ్యులర్ కాలమ్ లో ఇదే రాసారు.

‘’..... తెలుగుదేశం నాయకులు అన్నారు అని కాదు గానీ ఈ 10 వేల కోట్ల రూపాయల వ్యవహారంలో కూడా ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్‌ రెడ్డి పప్పులో కాలేశారు. ఒక వ్యక్తి 10 వేల కోట్ల రూపాయలు వెల్లడించారన్న విషయం చంద్రబాబుకు ఎలా తెలిసిందని ప్రశ్నించడం ద్వారా ఆ మొత్తం తనదేనని ప్రజలు మరింత అనుమానించే పరిస్థితి తెచ్చుకున్నారు. చంద్రబాబుకు ఎలా తెలిసిందన్న దానికంటే ఆ మొత్తం ఎవరిదో తెలుసుకోవడానికే ప్రజలు ఉత్సాహం ప్రదర్శిస్తారు. ఈ సూక్ష్మాన్ని విస్మరించి నీకెలా తెలిసింది అని అనడంతో జగన్‌ బురదలో కాలేశారు.  చివరకు దిద్దుబాటు చర్యలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు బినామీనే సదరు మొత్తాన్ని ప్రకటించారనీ, చంద్రబాబు ఆస్తులపై విచారణ జరపాలనీ కోరారనుకోండి. పత్రికలలో వచ్చిన వార్తలపై జగన్మోహన్‌ రెడ్డి ముందే స్పందించి ఆ 10 వేల కోట్లు చంద్రబాబు బినామీవేనా అని సందేహం వ్యక్తంచేసి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. చంద్రబాబు స్పందించిన తర్వాత ప్రతిస్పందించడం వల్ల ఫలితం లేకపోగా ఎదురుతన్నింది. ఎదురుదాడి ఎలా చేయాలో తండ్రి రాజశేఖర్‌రెడ్డి నుంచి అయినా జగన్‌ ఎందుకు నేర్చుకోలేదో తెలియదు. ఉండవల్లి వంటివారు అయినా ఎందుకు నేర్పడం లేదో! రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యర్థులపై ఎదురు దాడికి దిగుతూ వారిని ఆత్మరక్షణలోకి నెట్టేవారు. చివరకు పత్రికల విషయంలో కూడా ఆయన ఇదే విధానాన్ని అవలంబించారు. ఆ క్రమంలో పత్రికలలో వచ్చే వార్తలకు విశ్వసనీయత లేకుండా చూసుకున్నారు....’’

ఈ మాటలు వ్యక్తిగతమైనవో, ఓ పత్రికా సంపాదకుడివో అన్నది అనుమానం. ఎందుకంటే ఓ బాధ్యతాయుతమైన పత్రికా సంపాదకుడు ఇలా అనకూడదు. తెలుగుదేశం పార్టీ కావాలని జగన్ పై తప్పుడు ఆరోపణలు చేస్తే, ఇది తప్పు అని చెప్పాలి తప్ప, వాటిని ఎదుర్కోవడం జగన్ కు చాతకాలేదు అని చెప్పడం కాదు. పైగా...’’’.... జగన్మోహన్‌ రెడ్డి ముందే స్పందించి ఆ 10 వేల కోట్లు చంద్రబాబు బినామీవేనా అని సందేహం వ్యక్తంచేసి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది...’’ అని ఓ సంపాదకుడు అనడం అంటే, తప్పుడు ఆరోపణలను ఎలా ఎదుర్కోవాలో నేర్పుతున్నట్లు వుంది తప్ప, తప్పు చేసేవాళ్లను తప్పు పట్టినట్లు లేదు. 

నిజానిజాలు తెలియకుండా ఇలాంటి ఆరోపణలు తెలుగుదేశం పార్టీకి తగదు అని ఒక్క లైన్ రాసి వున్నా , మరింత హుందాగా వుండేది. పైగా ఆ వ్యాసంలో మరిన్ని కొత్త విషయాలు వెల్లడించడం ద్వారా, జనాల్లోకి మరిన్ని అనుమానాలు పంపించారు. ఈ కొత్త విషయాలు మరీ గమ్మత్తుగా, ఆసక్తికరంగా వున్నాయి. దీనివల్ల అసలు ప్రధాని మోడీ, ఆర్థికమంత్రి జైట్లీ లు సంయుక్తంగా ప్రవేశపెట్టిన ఆదాయ వెల్లడి పథకం విధివిధానాలనే శంకించాల్సి వస్తోంది.  ఎందుకంటే. రాధాకృష్ణ తన వ్యాసంలో....

‘’’.... ఈ పథకం కింద ఆదాయం వెల్లడించిన వారి వివరాలు గోప్యంగా ఉంచవలసిన విషయం వాస్తవమే! అయినా పత్రికలకు ఎలా తెలిసిందన్న సందేహం తలెత్తకమానదు. పథకం గడువు ముగుస్తుందన్న దశలో హైదరాబాద్‌ నుంచి ఒక వ్యక్తి 9,800 కోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రకటిస్తూ దరఖాస్తు దాఖలు చేశారు. దేశ చరిత్రలో ఇంత మొత్తం ఆదాయాన్ని ఏ ఒక్క వ్యక్తి కూడా ప్రకటించనందున ఆశ్చర్యపోయిన ఆదాయపన్ను శాఖ ఉన్నతాధికారులు అది నిజమైన దరఖాస్తో, బోగస్‌ దరఖాస్తో అన్నది తేల్చుకోలేక విషయాన్ని విదేశీ పర్యటనలో ఉన్న కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్‌ చెవిన వేశారు. దీంతో ఆశ్చర్యపోవడం ఆయన వంతు అయింది. ఆయన ముఖ కవళికలను గమనించిన వారు ఏమి జరిగిందా అని ఆరా తీయగా విషయం బయటకు పొక్కింది. దరఖాస్తు చేసిన వ్యక్తి వద్ద నిజంగా 10 వేల కోట్ల రూపాయలు ఉన్నాయా? లేవా? అన్నది నిర్ధారించుకోవడానికై నవంబర్‌ 30 లోపు చెల్లించవలసిన 25 శాతం పన్నును వెంటనే చెల్లించమని సదరు వ్యక్తిని కోరాలని నిర్ణయించారు.   అధికారులు అడిగిందే తడవుగా సదరు వ్యక్తి 25 శాతం పన్నును కూడా చెల్లించారు. ఈ 25 శాతం పన్ను మొత్తాన్ని లెక్కించడానికి మూడు రోజులు పట్టిందనీ, సీసీ కెమెరాల నీడలో నగదు లెక్కింపు జరిగిందనీ అధికారులలో ప్రచారం జరుగుతోంది. 9,800 కోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రకటించిన వ్యక్తి తరఫున దరఖాస్తు దాఖలు చేసిన ఆడిటర్‌ పనిలోపనిగా తనకు లభించిన 200 కోట్ల రూపాయల ఫీజును కూడా ఆ పథకం కింద ప్రకటించారు. దీంతో మొత్తం 10 వేల కోట్ల రూపాయలు అయ్యింది. ఇది కాకుండా మరో వ్యక్తి ఢిల్లీలో ఉన్న తన ’పాన్‌’ నంబర్‌ను హైదరాబాద్‌కు బదిలీ చేయించుకుని మూడు వేల కోట్ల రూపాయల ఆదాయన్ని ప్రకటించారు. జరిగింది ఇది కాగా, ఏపీ రాజకీయ నాయకులు మాత్రం ఎవరో ప్రకటించిన ఆదాయంపై విమర్శలు, ప్రతి విమర్శలకు దిగుతున్నారు...’’

ఇంత క్లియర్ గా వ్యక్తులు ఎవరు అన్నది మినహా అంతా రాయగలిగారు. అంటే కేంద్ర డైరక్ట్ టాక్స్ బోర్డు చైర్మన్ ఫోన్ మాట్లాడింది మొదలు అన్నీ బయటకు వచ్చేసినట్లే. మరింక రహస్య వెల్లడి పథకం అని ఎలా అనగలం? ఓ వ్యక్తి 200 కోట్లు వెల్లడించారని అనడం వేరు. ఆ వ్యక్తి ఓ చార్టెడ్ అక్కౌంటెంట్ అని చెప్పడం వేరు. ఇలా అన్ని విషయాలు బయటకు వచ్చిన తరువాత, భవిష్యత్ లో మరోసారి రహస్యంగా వుంచుతాం, వెల్లడించండి అంటే ఎవరు ముందుకు వస్తారు అన్నది ఆలోచించాలి.

సరే, ఆ విషయం అలా వుంచితే,  రాధాకృష్ణ రాసిన దాని ప్రకారం. పదివేల కోట్లు వెల్లడిస్తానని చెప్పిన వ్యక్తి, అంత కెపాసిటీ వున్నవాడా లేనివాడా అని అధికారులకే అనుమానం వచ్చింది. అంటే కచ్చితంగా అంత సొమ్ము అతని దగ్గర వుంటుంది అని అధికారుల దృష్టి సోకనివాడై వుండి వుండాలి. అంటే కచ్చితంగా జగన్ కాదనే అనుకోవాలి. ఎందుకంటే జగన్ దరఖాస్తు చేస్తే కచ్చితంగా అధికారులు డబ్బు వుందని నమ్మే పరిస్థితే వుంది కదా ? సో జగన్ కాదు అని ఇండైరెక్ట్ గానైనా రాధాకృష్ణ సర్టిఫికెట్ ఇచ్చారనే అనుకోవాలి.

ఇంత జరిగాక, ఇంకా కేంధ్రం ఆలోచించే బదులు ఆ పదివేల కోట్లు ప్రకటించిన ఆసామీ ఎవరో చెప్పేస్తే బెటర్..లేదంటే గ్యాసిప్ ల కాలమ్  ల కింద అయినా ఏవో పేర్లు బయటకు రావడం, ఎవరికి వాళ్లు ఇలాంటి ఊహాగానాలు చేయడం , అనవసరంగా వేరే వాళ్లు ఇబ్బంది పడడం కన్నా, అది బెటర్ కదా? 

అవును..ఇంతకీ హైదరాబాద్ (తెలంగాణ) లో జరిగిన దాని గురించి ఆంధ్రలో ఇంత గందరగోళం జరుగుతుంటే, తెలంగాణ రాజకీయ నాయకులు ఎందుకు మౌనంగా వున్నారో? ఆ ఆసామీతో అక్కడేమైనా కనెక్షన్ వుందా? ఏంటీ?

Show comments